Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
- కూలీలకు కనీస సౌకర్యాలు కరువు
- నేడు యాదాద్రి జిల్లాకు బృందాకారత్ రాక
- అనాజిపురం గ్రామంలో కూలీలతో ముఖాముఖి
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పల్లెల్లో క్రమక్రమంగా పేదలకు ఉపాధి కరువవుతోంది.. సాగు పనులూ తగ్గుతున్నాయి. దాంతో వారికి ఒక పూట తిండి కూడా కష్టమవుతోంది.. ఒకపూట తింటే మరో పూట పస్తులుండే గడ్డుకాలం ఏర్పడింది. ఈ క్రమంలో పేదల జీవనోపాధి పెంపు.. ఉపాధి కల్పన కోసం వామపక్షాల పోరాటంతో యూపీఏ హయాంలో తెచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రస్తుత పాలకులు నిర్వీర్యం చేస్తున్నారు. గ్రామాల్లో కూలీలకు పనిని ప్రభుత్వమే కల్పించేలా 2005లో ప్రభుత్వం చట్టం చేసింది. కరోనా సమయంలో అన్ని రంగాలు స్తంభించినా ఆ చట్టమే నిరుద్యోగ యువతకు కూడా పట్టెడు అన్నం పెట్టింది. అందుకే ఈ చట్టం అన్ని వర్గాలకు నేడు ఉపాధి కల్పించే కల్పవృక్షంగా మారింది. కానీ ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది. క్రమంగా నిధుల కేటాయింపు తగ్గించింది.. కొత్త కొత్త నిబంధనలు పెడుతోంది. కూలీలకు సక్రమంగా పని, డబ్బులు అందని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 7,87,215 మందికి జాబ్‌కార్డులున్నాయి. అందులో దాదాపు 21,45,278మంది కూలీలు ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 3,70,214 కార్డులకు 8,70632 మంది కూలీలు, సూర్యాపేట జిల్లాలో 2,61,385 కార్డులు అందులో 3,48,775 కూలీలు ఉన్నారు. యాదాద్రి జిల్లాలో 1,55,616 జాబ్‌కార్డులుండగా 9,25,871 మంది కూలీలున్నారు. వీరిలో దాదాపు 6లక్షల మందికిపైగా కూలి పనులకు వెళుతుంటారు.
కూలీలకు కనీస వసతులు కరువు
ఉపాధి హామీ కూలీలు పనిచేసే చోట తాగునీటి సౌకర్యం కల్పించాలి. ప్రత్యేకంగా ఓ కూలీని తాగునీరు ఏర్పాటు చేయడానికే నియమించాలి. కానీ అలాంటి విధానం ప్రస్తుతం లేకుండా పోయింది. నీడ వసతి ఏర్పాటుకు టెంట్ వేయాలే.. చంటి పిల్లలు ఉంటే వారిని ఆడించడం కోసం ఆయాను, పనిచేసే చోట ప్రమాదం జరిగితే మెడికల్ కిట్‌ను అందుబాటులో పెట్టాలే. కానీ ప్రస్తుతం ఇవేమీ ఉండటం లేదు. మొదట్లో ఇచ్చిన పనిముట్లు తప్ప మళ్లీ ఇవ్వలేదు. సౌకర్యాలు లేవుగానీ, కొత్తగా నిబంధనల పేరుతో కూలీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పని చేసే సమయంలో రెండు పూటలా ఫొటోలు తీసి ఆన్లైన్లో పెట్టాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అంతేగాకుండా కూలీల్లోనూ విభజన రేఖలు గీస్తోంది కేంద్రం. వారిని వివిధ సామాజిక తరగతులుగా విభజించాలంటోంది. పనిచేసే చోట ప్రమాదం జరిగితే పరిహారం ఇవ్వకుండా చట్టాన్ని తుంగలో తొక్కేస్తున్నారు. గత వేసవి కాలంలో భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో ఉపాధి కూలీకి వెళ్లిన బొల్లేపల్లి నర్సమ్మకు పాము కరిచింది. దాదాపు 25రోజులు పనికి వెళ్లలేదు. రెడ్డి నాయక్ తండాకు చెందిన బుజ్జమ్మ వేసవి కాలంలో వడదెబ్బతో చనిపోయింది. వీరిద్దరు సుమారు నెల రోజుల వరకు పనికి వెళ్లలేదు. వాస్తవంగా వీరికి కూలితోపాటుగా పరిహారం కూడా ఇవ్వాలి, కానీ అవేమీ ఇవ్వకుండా అధికారులు చేతులు దులుపుకున్నారు.
గిట్టుబాటు కానీ కూలి
ఉపాధి కూలీలకు రోజు కూలి రూ.257 ఇవ్వాల్సి ఉన్నా.. ప్రస్తుతం అత్యధికంగా రూ.150, అత్యల్పంగా రూ.50వరకు గిట్టుబాటవుతోంది. అంతేగాకుండా కూలీల రోజువారి కూలి వివరాలను తెలియజేసే పే స్లిప్ ప్రధాన సమస్యగా ఉంది. పే స్లిప్ ఇవ్వడం లేదు. వారం వారం కూలి ఇవ్వాల్సిన అధికారులు నెల రోజులైనా అందజేయడం లేదు. వేసవి అదనపు అలవెన్సుల్లోనూ కోత విధించారు. రోజు కూలిని బట్టి ఫిబ్రవరి నుంచి జూన్ వరకు అదనపు అలవెన్స్ ఇచ్చేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ నెంబర్ 17022(31)విడుదల చేసి వాటిల్లో కూడా కోత విధించింది. దీనివల్ల కూలీలకు తీవ్రనష్టం జరిగింది. ఒక్కొక్కటిగా ఉన్న నిబంధనలను తొలగించి చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోంది.
పనిదినాల పెంపునకు డిమాండ్
ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి కూలీకి ఏడాదిలో 100 రోజులు పని కల్పించాలి. కానీ మారుతున్న పరిస్థితుల్లో ఏడాదిలో సుమారు 80-100రోజులు వ్యవసాయ పనులు ఉంటాయి. మిగతా 165రోజులు కూలీలకు పనులు ఉండటం లేదు. అందుకే ఉపాధి హామీ చట్టం పనిదినాలను 200 రోజులకు పెంచాలనే డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఇదిలా ఉంటే, కరోనా సమయంలో నగరాల్లో ఉన్న నిరుద్యోగ యువత కూడా పల్లెలకు వచ్చి ఉపాధి హామీ పనులు చేసి పూటగడుపుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మోత్కుర్, ఆలేరు, చండూరు, చిట్యాల మన్సిపాలిటీలతోపాటు అనేక వాటిల్లో ఇంకా పల్లె వాతావరణమే కనిపిస్తుంది.
నేడు అనాజిపురం గ్రామానికి బృందాకారత్ రాక
గ్రామీణ పేదలకు కూలీ పని కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలనే డిమాండ్‌తో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం నిర్వహించారు. యూపీఏ-1 హయాంలో పార్లమెంటు సభ్యులుగా ఉన్న బృందాకారత్.. ఉపాధి హామీ చట్టం ప్రాధాన్యతను గుర్తించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, ప్రస్తుతం చట్టం అమలు తీరు, కూలీలకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలను తెలుసుకునేందుకు నేరుగా ఉపాధి కూలీలతో బృందాకారత్ ముఖాముఖి నిర్వహించబోతున్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా అనాజిపురం గ్రామానికి వస్తున్నారు.
కూలీలు పెరుగుతున్నరు.. బడ్జెట్ కూడా పెంచాలి
ప్రతిఏటా ఉపాధి హామీ పనుల కోసం కూలీల సంఖ్య పెరుగుతోంది. దానికి అనుగుణంగా బడ్జెట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి కూలీకి రోజువారి కూలి రూ.600 ఇవ్వాలి. ప్రమాదం జరిగితే ప్రమాదబీమా సౌకర్యం కల్పించడమేగాకుండా మెడికల్ సెలవులు ఇవ్వాలి. పట్టణాల్లో కూడా ఉపాదీహామీ పని కల్పించాల్సిన అవసరం ఉంది.
- కొండమడుగు నర్సింహ, వ్యకాస రాష్ట్ర కార్యదర్శి