Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాటి వర్గపోరుకు బీజేపీ వక్రభాష్యం...
- మతాల మధ్య ఘర్షణగా చిత్రీకరించేందుకు కుట్ర
- వీరనారి ఐలమ్మ స్ఫూర్తిగా భూపోరాటం
- సాయుధ పోరాట వార్షికోత్సవ సభలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కరత్
హనుమకొండ నుంచి కె.ప్రియకుమార్
ఎప్పుడైనా.. ఎక్కడైనా చరిత్రను వక్రీకరించే వారికి ప్రజల నుంచి తిరస్కారం తప్పదని సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్ హెచ్చరించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమనేది ఒక మహోన్నత వర్గపోరాటమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని చరిత్ర స్పష్టంగా చెబుతున్నా... ఆ వాస్తవాన్ని పక్కనబెట్టి దాన్ని హిందూ, ముస్లింల మధ్య ఘర్షణగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నించటం అత్యంత దారుణమని విమర్శించారు. సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి అధ్యక్షతన జరిగిన ఈ సభలో బృందా కరత్ ముఖ్య వక్తగా ప్రసంగించారు. ఐలమ్మ వర్థంతి సందర్భంగా తొలుత ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బృందా కరత్ మాట్లాడుతూ... పేద కుటుంబానికి చెందిన ఐలమ్మ తన పోరాట పటిమతో నిజాం రాజును సైతం గజగజ వణికించిందని గుర్తు చేశారు. ఆమె ఆనాడు ఏయే సమస్యల పరిష్కారం కోసమైతే పోరాటం చేశారో... ఆ సమస్యలు నేటికీ అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐలమ్మ స్ఫూర్తితో భూ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఒకవైపు బ్రిటీష్ పాలకులు, మరో వైపు వారి సామంతుడు నిజాం రాజుకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటానికి ఆంధ్ర మహాసభ పేరుతో కమ్యూనిస్టు పార్టీ, ఎర్రజెండా అండగా నిలిచాయని గుర్తుచేశారు. బానిసత్వం, వెట్టిపేరుతో దేశ్‌ముఖ్‌లు, నిజాం... పేద ప్రజల్ని అన్యాయంగా శ్రమదోపిడీకి గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జమీందార్ల దోపిడీకి వ్యతిరేకంగా ఐలమ్మ నిలబడిందని వివరించారు. ఆమె భర్తను అన్యాయంగా అరెస్టు చేసి జైలు పాలు చేసి, ఆమె కూతురుపై సామూహిక లైంగిక దాడి చేసినా పోరాటం నుంచి ఒక్క అడుగు కూడా వెనుకడుగేయని వీరనారి ఐలమ్మ అని నివాళులర్పించారు. ఆమెకు కమ్యూనిస్టు పార్టీ అండగా నిలిచిందన్నారు. వీరనారి ఐలమ్మ స్ఫూర్తితో మూడు వేల గ్రామలకు ఎర్రజెండా విస్తరించి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిందని తెలిపారు. అయితే ఆనాడు పెట్టుబడిదారీ, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని నేడు మోడీ బ్యాచ్ వక్రీకరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా వక్రీకరణలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్బంధాలకు ఎదురొడ్డి ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ప్రజలు పోరాటం చేయటం అభినందనీయమన్నారు.
నిజాంకు వ్యతిరేకంగా కొనసాగిన పోరాటంలో ప్రజలు మతాలకు అతీతంగా ఒక్కతాటిపై నిలబడ్డారని బృందా కరత్ ఈ సందర్భంగా చెప్పారు. ఆనాడు భారత సైన్యం మూడు వేల గ్రామాల్లో కమ్యూనిస్టులను వెతికి రజాకార్ల కన్నా ఎక్కువగా హింసించి చంపిందని తెలిపారు. ఇది వాస్తవ చరిత్ర అనీ, దీన్ని ఏమార్చేందుకు ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నాటి పోరాటంలో హిందువులు, ముస్లింలూ ఉన్నారని వివరించారు. భూమి కోసం ఇప్పుడు కొనసాగుతున్న పోరాటంలోనూ వారున్నారంటూ చెప్పిన ఆమె అందుకు ఉదాహరణగా స్టేజీపై ఉన్న హిందు, ముస్లిం, క్రిస్టియన్ మహిళలను చూపించారు. ఇందుకు భిన్నంగా బీజేపీ ప్రత్యేకమైన కండ్లద్దాలను పెట్టుకుని చరిత్రకు వక్రభా ష్యాలు చెబుతున్నదంటూ ఎద్దేవా చేశారు. ఏ ఒక్క మతం కూడా పేద ప్రజలకు శత్రువు కాదనీ, వారికి దోపిడే నిజమైన శత్రువని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న పెట్టుబడిదారీ విధానాలతో దేశంలో అసమానతలు నానాటికీ పెరిగి పోతున్నాయని బృందా కరత్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో వంద మంది ధనవంతులకు రోజుకు రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుంటే, పేదలకు మాత్రం నెలకు రూ.10 వేలు నుంచి రూ.15 వేలు కూడా రావడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు దోపిడీని ప్రోత్సహిస్తున్న బీజేపీ మరోవైపు సంఘటితమైన పేదలను మతం పేరుతో చీల్చేందుకు కుట్రలు పన్నుతున్నదని తెలిపారు. బిల్కిస్ బానో లైంగిక దాడి ఘటనలో కోర్టు నేరస్తులుగా నిర్ణయించి శిక్ష వేసిన వారిని గుజరాత్ సర్కారు వదిలిపెట్టిందనీ, దీన్ని ఏ ఒక్క భారతీయ మహిళా ఎప్పటికీ క్షమించబోదని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదనీ, అది బ్రిటిష్‌కు వత్తాసు పలికిందని తెలిపారు. దాని ప్రతి రక్తపు చుక్కలో విషముంటుందనీ, అందుకే ఆయా నాయకులు తమ ప్రతి మాటలోనూ విషం కక్కుతుంటారని హెచ్చరించారు. ప్రజల మధ్య ఐక్యతతో పోరాటమే దీనికి విరుగుడని స్పష్టం చేశారు. విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యంగా నిలబడాలని ఆమె పిలుపునిచ్చారు. అలా నిలబడే ప్రజలకు ఎర్రజెండా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
కష్ట జీవులందరూ ఏకం కావాలి : పోతినేని
ప్రజల సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సమస్త కులాల ప్రజలు, కష్టజీవులు ఏకం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ పిలుపునిచ్చారు. బీజేపీ, ఆరెస్సెన్ విభజన రాజకీయాలను ఐలమ్మ స్ఫూర్తితో తిప్పికొట్టాలని సూచించారు. నాడు ఐలమ్మ భూమి కోసం పోరాడారనీ, అదే బాటలో బందాకారత్ ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో పేదల గుడిసెలను కాపాడేందుకు బుల్డోజర్కు ఎదురు నిలిచారని గుర్తు చేశారు. సాయుధ పోరాటంలో తొలి అమరుడు బందగీ, నిజాంను వ్యతిరేకించిన మఖ్దూం మొహియుద్దీన్, పాత్రికేయులు షోయబుల్లాఖాన్ తదితరులు ముస్లింలేనని గుర్తు చేశారు. వీరనారి ఐలమ్మను శ్రమదోపిడీకి గురి చేసిన రామచంద్రారెడ్డి హిందువని తెలిపారు. అందువల్ల దోపిడీదారుల్లో అన్ని మతాల వారున్నట్టే.. వారికి వ్యతిరేకంగా పోరాడిన పేదల్లోనూ అన్ని మతాల వారున్నారని వివరించారు. కేంద్ర మంత్రి అమిత్ షా సాయుధ పోరాట చరిత్ర తెలుసుకోకుండా అబద్ధాలను వల్లె వేశారని పోతినేని విమర్శించారు.