Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్క్సిజం తెలిసినవాళ్లు ఏ రంగంలోనైనా విస్తృత అధ్యయనం చేయలగరు: ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
- మహత్తరమైన పోరాటానికి నేటి పాలకుల వక్రభాష్యాలు : ఆలిండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ- సిటీబ్యూరో
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎంతో మహత్తరమైనదని, మట్టి మనుషుల్ని మహాయోధులుగా మార్చిన ఆ పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని, ప్రజా గాయకులు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. ఆలిండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి రాసిన 'తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం- ప్రచారాలు- వాస్తవాలు' పుస్తకాన్ని శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఉన్న నవతెలంగాణ బుకహేౌస్‌లో మల్లారెడ్డితో కలిసి గోరటి ఆవిష్కరించారు. అదేవిధంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని ఆ పోరాట సాహిత్య గ్రంథాలతో పుస్తక ప్రదర్శనశాలను సారంపల్లి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ఈ గ్రంథంతో ఒకనాటి పోరాటాన్ని క్లుప్తంగా, సమగ్రంగా, మంచి వ్యాఖ్యలతో అందరికీ అర్థమ య్యేలా రాశారన్నారని, మార్క్సిజం తెలిసినవాళ్లు దేంట్లోనైనా రాణించగలరని చెప్పారు. ఏ రంగంలోనైనా విస్తృతంగా అధ్యయనం చేయలగలరని తెలిపారు. వారు రైతు ఉద్యమ జాతీయ నాయకులని, తాను వారి అభిమానినని, తనకు ఇంత చారిత్రక ప్రామాణిక గ్రంథాన్ని ఆవిష్కరించే భాగ్యం కలగటం ఎంతో ఆనందంగా, గ్వరంగా ఉందన్నారు.
సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ.. 75 ఏండ్ల తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వాలు మేల్కొన్నాయని, వీలినమా? విమోచనమా? విద్రోహమా? అనే పెద్ద చర్చను అన్ని రాజకీయ పార్టీలు లేవదీశాయని తెలిపారు. ఈ నెల 17 నుంచి ఏడాదిపాటు బీజేపీ విమోచన పేరుతో ప్రచార కార్యక్రమాలు చేస్తామని, మరొకరు విద్రోహం అని చెబుతున్నాయని గుర్తుచేశారు. వాస్తవానికి భారతదేశంలో హైదరాబాద్ స్టేట్ విలీనం అనేది చారిత్రాత్మక సత్యం అన్నారు. నాటి పోరాటంలో ఆంధ్ర మహాసభ పిలుపుతో భీంరెడ్డి నర్సింహారెడ్డి లాంటి వారు ఐలమ్మ పంట భూములు కాజేయజూసిన విసునూరు దేశ్‌ముఖ్‌ను ఎదిరించారన్నారు. నిజాం సైన్యంతో 13 నెలల పోరాటంలో 1500 మంది అమరులైనారని, యూనియన్ మిలటరీతో సాగిన పోరాటంలో 2500 మృతిచెందారని తెలిపారు. ఈ పోరాటంలో కమ్యూనిస్టులు పంచిన 10లక్షల ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ భూస్వాములకూ, జమిందార్లకూ కట్టబెట్టిందని విమర్శించారు. అంతటి మహత్తరమైన పోరాటానికి నేటి పాలకులు వక్రభాష్యాలు చెబుతుండటం విస్మయానికి గురిచేస్తోందన్నారు. అందుకే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని ఈ పుస్తకాన్ని రాశానన్నారు. ఆనాటి ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధమున్న వ్యక్తినని, చాకలి ఐలమ్మ.. అసలు పేరు చిట్యాల ఐలమ్మ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ప్రసాద్, రైతుసంఘం నాయకుడు శోభన్ బాబు, కవి, రచయిత తంగిరాల చక్రవర్తి, నవతెలంగాణ సిబ్బంది ధనలక్ష్మి, వీరేశం, రఘు, సుభాషిణి, సిద్ధు, సుధాకర్ పాల్గొన్నారు.
నవతెలంగాణ ప్రచురణలపై 30శాతం డిస్కౌంట్
వారోత్సవాల సందర్భంగా నవతెలంగాణ ప్రచురణలపై 30శాతం డిస్కౌంట్, ఇతర పుస్తకాలపై 10శాతం డిస్కౌంట్ ఇస్తామని నవతెలంగాణ బుక్ హౌస్ ఇన్చార్జి కిష్టారెడ్డి తెలిపారు. దీనిని పాఠకులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.