Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్ విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కేంద్రంలోని మోడీ సర్కార్కు ముందుచూపు లేకపోవడం వల్లే దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు శనివారంనాడు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్రం వివక్షాపూరిత ఆలోచనలతో ఆహార ధాన్యాలను కొనకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందన్నారు. ఇప్పటికైనా ఆహార ధాన్యాల కొనుగోలుకు దేశవ్యాప్తంగా ఒకే సేకరణ విధానం ''వన్ నేషన్- వన్ ప్రొక్యూర్మెంట్'' అనుసరించాలని సూచించారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనకుండా దేశ ప్రజల ఆహార భద్రతను కేంద్రం పణంగా పెట్టిందని విమర్శించారు. నాలుగేండ్లకు సరిపడా గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని ఆరునెలల క్రితం గొప్పగా చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వం, తాజాగా బియ్యం ఎగుమతులను నియంత్రించి 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించిందని తెలిపారు. ఇప్పటికే గోధుములు, దాని ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించారనీ, తాజాగా నూకల ఎగుమతిపైనా నిషేధం విధించిందన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని ఆరు నెలల క్రితం తాము విజ్ఞప్తి చేస్తే, దేశంలో అవసరానికంటే ఎక్కువ ఆహార నిల్వలు ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత ఆహార ధాన్యాల కొరతకు కారణమేంటో చెప్పాలని ఆయన పీయూష్గోయల్ను డిమాండ్ చేశారు.