Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీరనారి చిట్యాల ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తాం
- ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బీ వెంకట్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సామాజిక మార్పు కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మతోన్మాదులు మతం రంగు పూస్తున్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీ వెంకట్ అన్నారు. బీజేపీ ప్రజల మధ్య మతం చిచ్చుపెట్టి కలహాలు సృష్టించి, ప్రజా ఉద్యమాలను బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఈ కుట్రలను తిప్పికొడుతూ, వీరనారి చిట్యాల ఐలమ్మ భూపోరాట అశయాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. శనివారంనాడిక్కడి రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిట్యాల ఐలమ్మ స్మారక ఉపన్యాసంలో మాట్లాడారు. చారిత్రక నేపథ్యం నేడు అసత్యాలు, అర్ధసత్యాలతో వక్రీకరణకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం పోరాటం జరిగిందనీ, దానికీ బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. భారతదేశంలో తెలంగాణ విలీన సమయంలో 4 వేల మంది వీరులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. బీజేపీి ఉచ్చులోపడి తెలంగాణ మరోసారి మతకలహాల కుంపటిగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, రాష్ట్ర నాయకులు మిరియం వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.