Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీరనారి ఐలమ్మ స్ఫూర్తితో భూపోరాటాలు నిర్వహించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాల యంలో ఐలమ్మ 37వ వర్థంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ పోరాట పటిమను వివరించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులు ప్రజల మధ్య అనైక్యతను సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు. కుల, మత అంతరాలను పెంచి మత ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి తిరోగమన విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ మాట్లాడుతూ వీరనారి ఐలమ్మ ఆశయంలో భాగమైన భూమి సమస్య నేటికి పరిష్కారం కాలేదని తెలిపారు. కేంద్రం బీజేపీ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం, ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చుతున్నదని పేర్కొన్నారు. పేదల జీవితాలతో చెలగాట మాడుతున్నదని విమర్శించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు బి సుబ్బారావు, జిల్లా నాయకులు జి రాములు కె విజరు కుమార్, ఎస్ ఎఫ్ ఐ నగర కార్యదర్శి అశోక్ రెడ్డి సీఐటీయూ నాయకులు రమేష్, వత్తి సంఘాల నాయకులు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.