Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిస్టులు ప్రాణాలకు తెగించి పోరాడారు: ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ
- షాద్‌నగర్‌లో బైక్ యాత్ర ప్రారంభం
నవతెలంగాణ- ఫరూఖ్‌నగర్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి విజయం సాధిస్తే.. నేడు బీజేపీ నాయకులు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో బైక్ యాత్రను ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రారంభించారు. ముందుగా పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బహిరంగ సభలో వారు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, బందగి లాంటి అనేకమంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా సాయుధ పోరాటంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం సాయుధ పోరాటం నడిపి వేల ఎకరాల భూములను పేద ప్రజలకు పంచిన ఘనత సాయుధ పోరాటం నడిపిన కమ్యూనిస్టులదేనని స్పష్టం చేశారు.
అంతటి ఘన చరిత్రను నేడు బీజేపీ నాయకులు వక్రీకరించి విమోచన దినోత్సవం జరుపుకోవడం చాలా దారుణమైన చర్యన్నారు. కమ్యూనిస్టులు విలీన దినోత్సవం అంటుంటే బీజేపీ వారు విమోచనం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన పోరాట గాధలను గుర్తు చేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, అన్ని నియోజకవర్గాలు కలుపుకుంటూ శనివారం ప్రారంభమైన బైక్ ర్యాలీ ఏడు రోజులపాటు ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఊరూరా తిరుగుతుందన్నారు. ఈ నెల 17న మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ముగింపు సభ ఉంటుందని, ముగింపు బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరవుతారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.సామేల్, మధుసూదన్ రెడ్డి, ఎన్.రాజు, జి.కవిత, డి.జగదీష్ తదితరులు పాల్గొన్నారు.