Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హక్కు పత్రాల కోసం ఎదురు చూస్తున్న గిరిజనులు
- తండాల అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలి
- గిరిజనుల సమస్యలపై మంత్రికి టీజీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు సాగుదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తులను తక్షణ పరిశీలించాలని తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, సహాయ కార్యదర్శి ఎం బాలూనాయక్ వినతి పత్రం సమర్పించారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం2006 ప్రకారం 2005 డిసెంబర్ 13కు ముందు 10 ఎకరాల లోపు సాగులో ఉన్న వారందరికీ హక్కుపత్రాలివ్వాలని కోరారు. కటాఫ్ తేదీని 2018వరకు కేంద్రం పొడింగించిన తర్వాతనే అందరికీ హక్కులు కల్పిస్తామని చెప్పడం సరికాదని గుర్తుచేశారు.ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు పెంచుతూ ప్రత్యేక తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పాటైన తండా గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన తెగలకు ప్రత్యేక భాష, సంస్కృతి, హక్కులు వేరుగా ఉన్నందున ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. జాటోత్ ఠానూనాయక్ విగ్రహాన్ని ట్యాంకుబండ్‌పై ఏర్పాటు చేయాలనీ, గిరిజన యూనివర్సిటీని 2023లోపు ఏర్పాటు చేసేవిధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు. సూచించారు. దళిత బంధు తరహాలో గిరిజన బంధు పథకాన్ని ట్రైకార్ సంస్థద్వారా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలనీ, బడ్జెట్లో కేటాయిస్తున్న గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధులు గిరిజనులకే ఖర్చు చేయాలని కోరారు. అన్ని జిల్లాల్లో గిరిజన అభివృద్ధి భవనాలను నిర్మించాలని వారు విజ్ఞప్తి చేశారు.