Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు శాపంగా కేంద్రం నిర్ణయాలు
- బీజేపీపై ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఫైర్
నవతెలంగాణ-పటాన్చెరు
కేంద్రానికి దశాదిశా లేదని.. బీజేపీ సర్కారు నిర్ణయాలు రైతులకు శాపంగా మారాయని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలో పలు అభివృద్ధి పనులను మంత్రి శనివారం ప్రారంభించారు. పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నూకల ఎగుమతి, వరిధాన్యం మీద కేంద్రం నిషేధం విధించడం దారుణమన్నారు. తాము కష్టపడి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి పంటలు పండిస్తే.. నేడు తెలంగాణ ధాన్యాగారం అయిందన్నారు. పండిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్రం రాజకీయం చేస్తున్నదని విమర్శించారు. మంత్రి నిరంజన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి అడిగితే.. నూకలు మీరే తినాలని అవమానించారన్నారు. దేశంలో ఆహారం నిల్వలు తగ్గినప్పుడు నిషేధం పెడతారని.. అలాంటిది ఇప్పుడు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. దేశ ఆహార భద్రతకు భరోసా లేకుండా కేంద్రం అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. బీజేపీ పాలన రైతులకు శాపంగా మారిందన్నారు. త్వరలో పటాన్ చెరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు.అంతకుముందు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నేతృత్వంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ కాన్వారుతో మంత్రికి ఘన స్వాగతం పలికారు.