Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరణించిన వీఆర్ఏలకు నేడు మండల కేంద్రాల్లో శ్రద్ధాంజలి
- రేపు హైదరాబాద్‌లోని మినిష్టర్ క్వార్టర్స్ వద్ద నిరసన : వీఆర్ఏ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న అసెంబ్లీని ముట్టడించనున్నట్టు వీఆర్ఏ జేఏసీ ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. శనివారం హైదరాబాద్‌లోని సీసీఎల్ఏ కార్యాలయం ఆవరణలో వీఆర్ఏ జేఏసీ సమావేశం జరిగింది. జేఏసీ కో-చైర్మెన్ రమేశ్ బహదూర్, సెక్రటరీ జనరల్ ఎస్కే దాదేమియా, కన్వీనర్ డి.సాయన్న, కో-కన్వీనర్లు మహ్మద్ రఫీ, వెంకటేశ్‌యాదవ్, వంగూరు రాములు, ఎన్.గోవింద్, ఎల్.నర్సింహారావు, కె.మాధవనాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ సమ్మెకాలంలో మరణించిన వీఆర్ఏలకు సంతాపం తెలిపి శ్రద్ధాంజలి ఘటించాలని పిలుపునిచ్చారు. జేఏసీ ఆధ్వర్యంలో అసెంబ్లీలో తమ సమస్యపై మాట్లాడాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లో గల జూబ్లీహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయం వద్ద రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన వీఆర్ఏలు ప్లకార్డులతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. 23 వేల మంది వీఆర్ఏలు ఈ నెల 13న చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
సమ్మెకు సంఘీభావంగా రేపు మండల కేంద్రాల్లో నిరసనలు : కార్మిక సంఘాలు
వీఆర్ఏల సమ్మెకు సంఘీభావంగా ఈ నెల 12న మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. శనివారం ఈ మేరకు రాంబాబుయాదవ్(టీఆర్ఎస్కేవీ), పాలడుగు భాస్కర్(సీఐటీయూ), వీఎస్ బోస్(ఏఐటీయూసీ), ఆర్డీ.చంద్రశేఖర్(ఐఎన్టీయూసీ), సూర్యం (ఐఎఫ్టీయూ), ఎం.శ్రీనివాస్(ఐఎఫ్టీయూ), రెబ్బ రామారావు(హెచ్ఎంఎస్), ఎంకే.బోస్ (టీఎన్టీయూసీ), భరత్(ఏఐయూటీయూసీ) సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 50 రోజుల సమ్మె కాలంలో 28 మంది వీఆర్ఏలు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పదించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారి సమ్మెకు సంఘీభావంగా నిరసనలకు పిలుపునిచ్చామని తెలిపారు. వాటిని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.