Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర కార్మిక సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం ఈ మేరకు ఆర్.డీ.చంద్రశేఖర్(ఐఎన్టీయూసీ), వీఎస్బోస్ (ఏఐటీయూసీ), పాలడుగు భాస్కర్(సీఐటీయూ), రెబ్బారామారావు (హెచ్ఎమ్ఎస్), కె.సూర్యం (ఐఎఫ్టీయూ), యంకే బోస్(టీఎన్టీయూసీ), ఎం.శ్రీనివాస్ (ఐఎఫ్టీయూ), బాబూరావు(ఏఐయూటీ యూసీ) సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సింగరేణిలో పనిచేస్తున్న 25వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు సరైన జీతాలు చెల్లించకుండా యాజమాన్యం కాలయాపన చేయడం దారుణమని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో సెంట్రల్ లేబర్ కమిషనర్ వద్ద జరిగిన చర్చల్లో జీతాలు పెంచటానికి యాజమాన్యం నెలరోజుల సమయం అడిగి మోసం చేసిందని తెలిపారు. నిరవధిక సమ్మె చేస్తామని నెల కిందనే చెప్పినా యాజమాన్యం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించిందని విమర్శించారు. సింగరేణిలో పనిచేస్తున్న అన్ని కార్మిక సంఘాలు సంయుక్త నాయకత్వంలో కార్మికులు చేస్తున్న సమ్మె వందశాతం విజయవంతంగా నడుస్తున్నదని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులు బొగ్గు గనులకు సంబంధించిన హై పవర్ కమిటీ వేతనాలు గానీ, సుప్రీం కోర్టు చెప్పినట్టుగా సమాన పనికి సమాన వేతనం గాని ఇవ్వాలని కోరడంలో న్యాయం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. లేనిపక్షంలో పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని హెచ్చరించారు.