Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన ధరలతో కూరగాయలు కూడా రాని స్థితి
- గురుకులాల్లో మూన్నెళ్లుగా టెండర్లు లేవు
- రాష్ట్రంలో ఏడాదికాలంలోనె ఫుడ్‌పాయిజన్‌తో 29మంది మృతి
- మూడేండ్లు ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.3380కోట్ల పైనే!
- ఎన్ఈపీ-2020తో అశాస్త్రీయ విద్యకు కేంద్రం అడుగులు
- ప్రభుత్వ వర్సిటీలను గాలికొదిలి.. ప్రయి'వేటు' దారులు
- రాబోయే మూడేండ్లలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ
- వేదిక కానున్న రాష్ట్ర మహాసభలు : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాకార్యదర్శి టి.నాగరాజు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
'జైల్లో ఖైదీకి పెట్టే భోజనం ఖర్చు రోజుకు రూ.75 ఇస్తుంటే.. సంక్షేమ వసతిగృహ పిల్లలకు మాత్రం రూ.35 మాత్రమే ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. పెరిగిన నిత్యవసర సరుకుల ధరల నేపథ్యంలో సర్కారు ఇచ్చే రోజువారీ ఖర్చుతో కనీసం కాయగూరలు రాని పరిస్థితి నెలకొంది. నీళ్లచారు, ఉడికీఉడకని అన్నంతో కడుపునింపుకుంటున్న పేదపిల్లలు ఏడాదికాలంలోనే ఫుడ్‌పాయిజన్‌తో 29 మంది మరణించారు. మూడేండ్లుగా రూ.3380కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయి పడ్డ రాష్ట్ర సర్కారు ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. మరోవైపు ఎన్ఈపీ-2020 పేరుతో కేంద్రంలోని బీజేపీ సర్కారు అశాస్త్రీయ విద్యావిధానానికి అడుగులు వేస్తూ పేద పిల్లలను ఉన్నత విద్యకే దూరం చేయబోతోంది. ప్రభుత్వ వర్సిటీలను గాలికొదిలేసి.. ప్రయి'వేటు'కు దారులు వేస్తున్న పాలకుల వైఖరిపై ఎస్ఎఫ్ఐ అలుపెరగని పోరాటం చేస్తోంది. క్షేత్రస్థాయిలో సమస్యలపై ఉద్యమిస్తూ పాలకుల మెడలు వచ్చి పరిష్కారమార్గం చూపుతోంది.' అని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.నాగరాజు చెప్పుకొచ్చారు. అదే స్ఫూర్తితో రాబోయే మూడేండ్ల కాలంలో ఉద్యమ కార్యచరణ రూపొందించుకునేందుకు కరీంనగర్ వేదికగా ఈనెల 14న ఆ సంఘం రాష్ట్ర నాలుగో మహాసభలను నిర్వహిస్తున్న నేపథ్యంలో 'నవతెలంగాణ'కు నాగరాజు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ అంశాలు..
నూతన విద్యావిధానం (ఎన్ఈపీ-2020) పేరుతో కేంద్రంలోని బీజేపీ సర్కారు అశాస్త్రీయ విద్యావిధానానికి అడుగులు వేస్తోందన్నారు. మతపర విభజనలు సృష్టిస్తూనే.. విద్యార్థుల వేషధారణ, తిండి.. ఇలా పలు సున్నితమైన మత వైషమ్యాలను తీసుకొచ్చి విషబీజాలు నాటుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. చరిత్రను వక్రీకరిస్తూ, స్వాతంత్య్ర పోరాట పాఠ్యాంశాలనే తొలగిస్తోందని తెలిపారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ వర్సిటీలనూ గాలికొదిలేసి పాఠశాలస్థాయి నుంచి యూనివర్సిటీ వరకూ ప్రయివేటుపరం చేస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ యూనివర్సిటీలకైతే కనీస నిధులు ఇవ్వకుండా వర్సిటీలు కుంటుపడేలా చేస్తూ ప్రయివేటు యూనివర్సిటీలకు విచ్ఛలవిడిగా అనుమతులు ఇస్తున్నాయన్నారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో పోస్టులు భర్తీ చేయడం లేదని, పీహెచ్డీ చేస్తున్న విద్యార్థులకు కనీసం గైడ్షిప్ ఇచ్చే పరిస్థితి లేదంటే వర్సిటీల్లో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థమవుతుందన్నారు. ఇక చిన్నస్థాయిలో శాతవాహన, మహాత్మా, పాలమూరు యూనివర్సిటీల్లో కొత్త రిక్రూట్‌మెంట్‌నే మరిచిపోయారన్నారు. కొత్త కోర్సులు లేవని, ఉన్న కోర్సులనే సెల్ఫ్‌ఫైనాన్స్‌గా మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు రాష్ట్రంలో మూడేండ్లుగా ఫీజురీయింబర్స్‌మెంట్ చెల్లించని సర్కారు విద్యార్థులకు రూ.3380కోట్లు బకాయి పడిందన్నారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కనీస వసతులూ కల్పించకుండా అద్దె భవనాల్లో అవస్థలు పెడుతోందని తెలిపారు. పరిశుభ్రత, పౌష్టికాహారంలేక ఏడాది కాలంలోనే 29 మంది మృతి చెందారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇటీవల పాముకాటుతో ఓ హాస్టల్ విద్యార్థి చనిపోవడం వసతి గృహాల్లో రక్షణ చర్యలకు అద్దం పడుతుందన్నారు.
కరీంనగర్ వేదికగా భవిష్యత్ ఉద్యమ కార్యచరణ
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాలుగో మహాసభలకు కరీంనగర్ ముస్తాబవుతోందని తెలిపారు. ఈనెల 14,15,16 తేదీల్లో నిర్వహించబోయే ఈ సభలకు రాష్ట్రంలోని 5,12,684 విద్యార్థులకు ప్రాతినిధ్యం వహిస్తూ 700 మంది ప్రతినిధులు సభకు హాజరుకాబోతున్నారన్నారు. సుమారు 25 అంశాలపై మహాసభలో మూడేండ్ల ఉద్యమ కార్యచరణకు తీర్మానించబోతున్నామని చెప్పారు. ఈ మహాసభల ప్రాంగణవీధికి కరీంనగర్ జిల్లా విద్యార్థి ఉద్యమంలో అమరుడైన కన్నూరి రమేష్ నగర్‌గా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పనిచేసిన పసూల మారుతి పేరుతో సభాప్రాంగణాన్ని తీర్చిదిద్దబోతున్నామని తెలిపారు. ఇక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పేరుతో బహిరంగసభా వేదిక నిర్మించబోతున్నామని, దీనికి ఎస్ఎఫ్ఐ పూర్వ జాతీయ అధ్యక్షులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వి.శివదాసన్, ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు విపి.సాను, మయూక్ బిస్వాస్ పాల్గొనబోతున్నారన్నారు. సభలో వామపక్ష విద్యార్థి సంఘాల, ప్రజాసంఘాల నేతలు సౌహార్థ సందేశాలు ఇవ్వనున్నారన్నారు.