Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంట పొలాల్లో మైనింగ్ తవ్వకాలు
- రంగారెడ్డి జిల్లాలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వేల ఎకరాల్లో పర్మిషన్లు
- అంతమవుతున్న మానవ వనరులు
- మూగజీవాల మనుగడ ప్రశ్నార్థకం
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
'గొర్రెలు, బర్రెలు కాసుకొని బతికేటోళ్లం. మాకున్న కాస్తాంత భూమిలో పంటలు పండించుకుని జీవనం సాగిస్తున్నం. సాఫీగా సాగుతున్న మా బతుకుల్లో మైనింగ్ భూతం చీకట్లు నింపింది. గొర్రెలు, బర్రెలను బలిగొంది. పచ్చటి పంట పొలాలను రాళ్ల దిబ్బలుగా మార్చింది. పొద్దాంతా కాయ కష్టం జేసి.. పొద్దుమీకి ఇంట్లో ప్రశాంతంగా పడుకుందామంటే మైనింగ్ కోసం పేల్చే బాంబుల శబ్దాలతో కంటికి కునుకు లేదు. మా భూముల్లో మైనింగ్ తవ్వకాలు చేపట్టొద్దని అధికారుల కాళ్లవేళ్లా పడ్డా.. కనికరించలేదు. పైగా మా కన్నీటి కంటే వ్యాపారులిచ్చే కాసుల వైపు మొగ్గు చూపి. మా బతుకులను చిన్నభిన్నం చేశారు.' అంటూ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధపూర్ గ్రామానికి చెందిన ప్రజలు 'నవతెలంగాణ' ఎదుట తమ గోడును వెల్లబోసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్ తవ్వకాలపై కథనం. రంగారెడ్డి జిల్లాలో సుమారు 1500 ఎకరాల విస్తీర్ణంలో ప్రజాభి ప్రాయానికి విరుద్ధంగా మైనింగ్, స్టోన్ క్రషర్ మిషన్ల ఏర్పాటుకు అధికారులు యత్నిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లోని చిన్నరావిరాల, పెద్ద రావిరాల పరిధిలోని సర్వే నంబర్ 268 లోని 517 ఎకరాల్లో మైనింగ్ జోన్ ఉంది. వీటిలో 40 మైన్స్ ఉండగా ఇటీవల కొన్నింటి లీజు గడువు ముగిసింది. ఇదే ప్రాంతంలో 17 స్టోన్ క్రషర్ మిషన్ల ఏర్పాటుకు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేయగా.. ప్రజలు వ్యతిరేకించారు. అయిన ప్పటికీ మైనింగ్, రెవెన్యూ, అధికారులు అనుమతులి చ్చారు. కడ్తాల్ మండలం ముద్వీన్ సమీపంలోని సర్వే నంబర్ 95లో 63.36 హెక్టార్లలో ఓ స్టోన్ క్రషర్ మిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా గ్రామస్తులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. వాతావరణ కాలుష్యంతో పాటు పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళనకు దిగారు. స్థానికులంతా వ్యతిరేకిస్తుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్, రెవెన్యూ అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. యాచారం మండలం మొండి గౌరెల్లి సర్వే నంబర్ 19లో 12.20 ఎకరాల్లో స్టోన్ క్రషర్ల ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. అయినా వ్యాపారులు స్టోన్ క్రషర్ మిషన్ల ఏర్పాటుకు యత్నిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు అడ్డు చెప్పకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొత్తూరు మండలం ఇన్ములనర్వ, ఎస్బీపల్లి, కొడిచర్ల, సిద్దాపూర్లో 700 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములుండగా, 12 హెక్టార్లలో మైన్స్ తవ్వకాలకు నాలుగు కంపెనీలకు లీజుకు ఇచ్చింది. లీజుదారులు ఇప్పటికే అనుమతి పొందిన విస్తీర్ణం కంటే అధికంగా తవ్వకాలు చేపట్టినట్టు ఆరోపణలున్నాయి. వీటిలో ఏ ఒక్కరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కడ్తాల్ మండలం ముద్వీన్ పరిధిలో ఆందోళన చేస్తే ఎన్ఓసీ పొందాలి. వీటి ఏర్పాటుతో వాతావరణ పరిరక్షణకు ఎలాంటి ముప్పులేదని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్ఓసీ జారీ చేయాలి. 75 కిలోవాట్ల సామర్థ్యానికి మించి వాడే విద్యుత్ కనెక్షన్‌కు ఇన్స్పెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ తెలంగాణ ఎన్ఓసీ జారీ చేయాలి. కానీ ఆయా శాఖల అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనలను తుంగలో తొక్కుతున్న అధికారులు
ఆయా మైనింగ్ వ్యాపారులతో జిల్లా మైనింగ్ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, స్థానిక రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా నిరభ్యంతర పత్రాలు జారీ చేస్తున్నట్టు స్థానికులు వాపోతున్నారు. వాస్తవానికి ఏదైనా ప్రదేశంలో స్టోన్ క్రషర్ మిషన్ ఏర్పాటు చేయాలంటే ముందు రెవెన్యూ అధికారుల నుంచి అక్కడ ఎలాంటి నీటి వనరులు లేవని, వ్యవసాయ యోగ్యత భూమి కాదని స్పష్టం చేయాల్సి ఉంది. కానీ అలాంటి నిబంధనలు ఏమీ పట్టించుకోకుండా అధికారులు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇవ్వడంతో స్థానికులు తీవ్రంగా నష్టపోతున్నారు. అక్రమంగా పర్మిషన్లు ఇచ్చి తమ బతుకుల్లో మట్టిగొట్టొద్దని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి నివాసప్రాంతాలు, పంట భూముల్లో నుంచి మైనింగ్‌ను తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
బోర్లుకూడిపోతున్నాయి
పెద్ద బండరాలు తీసేందుకు పెట్టే బాంబులతో చుట్టుపక్కల భూములు కంపించి బోరుబావులు కూడిపోతున్నాయి. బోరు మోటర్ ఇరుక్కుపోయింది. బాంబులు పేల్చుతుండటంతో రాళ్లు వచ్చి పంట పొలంలో పడుతున్నాయి. పొలం మొత్తం రాళ్ల దిబ్బలుగా మారుతోంది. సర్కారు దయ తలచి ఇక్కడి నుంచి మిషన్లు తీసేయాలి.
- నర్సయ్య నాయక్, రైతు
ఇండ్లు బీటలు బారుతున్నాయి
సాయంత్రం అయిందంటే.. బాంబుల మోత మోగుతోంది. ఇండ్లలో పిల్లలు జంకుతున్నారు. బాంబు పేలుడుకు భూమి కంపించి ఇండ్లు బీటలు బారుతున్నాయి. మా గోస ఎవరూ పట్టించుకుంట లేరు. భూమిలో నుంచి రాళ్లు తీసి వాళ్లు డబ్బులు పోగేసుకుంటున్నారు. మేం ఇండ్లు కూలిపోయి చస్తున్నాం. మైనింగ్ తవ్వకాలు వెంటనే ఆపాలి.
- వెంకయ్య నాయక్, పులిచర్ల కుంట తండా