Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి ఆహ్వానం
- ఇరువురూ ప్రగతిభవన్‌లో భేటీ
- దేశ రాజకీయాలపై చర్చ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాల్లోకి రావాలని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆహ్వానించారు. కేసీఆర్ వంటి సీనియర్ నాయకుడి అవసరం ఇప్పుడు దేశానికి అవసరం ఉందన్నారు. ఆదివారం కుమారస్వామి హైదరాబాద్‌కు వచ్చారు. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా స్వయంగా కేసీఆర్ ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, ఎస్.రాజేందర్ రెడ్డి కూడా సీఎం వెంట ఉన్నారని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఆదివారం నాడొక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ దేశం గర్వించేరీతిలో తెలంగాణను సీఎం కేసీఆర్ ప్రగతి పథాన నడుపుతున్నారని చెప్పారు. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు క్రియాశీలక భూమిక పోషించాలనీ, అందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కుమారస్వామి చెప్పినట్టు సీఎంఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశానికి తెలంగాణ మోడల్ అవసరమనీ, ఈ రాష్ట్రంలో మాత్రమే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, ఉచిత తాగు, సాగు నీరు, వ్యవసాయ అభివద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలు సహా పలు పథకాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను కుమారస్వామి సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావించినట్టు తెలిపారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం సమిష్టి కషి చేసేందుకు ఆయన అంగీకరించారని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాదకర, స్వార్థ రాజకీయ పంథా, దాని పర్యవసానాలను ఇరువురు నేతలు చర్చించి, తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారని సీఎంఓ పేర్కొన్నది. దేశాన్ని మత విద్వేష అంచుల్లోకి నెట్టబడకుండా కాపాడుకుంటామని వారిరువురు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని కూడా తెలిపారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి, దేశ గుణాత్మక ప్రగతికోసం రాజకీయ పార్టీని స్థాపిస్తే తమ సంపూర్ణ మద్దతుంటుందని ఈ సందర్భంగా కుమార స్వామి చెప్పారని ప్రకటనలో వివరించారు. అలాగే బీజేపీకి ప్రత్యామ్నయంగా కాంగ్రెస్ విఫలమైందని వారు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల ఐక్యత తక్షణావసరమని వారు అభిప్రాయపడ్డారు.
వత్తిళ్లు పెరుగుతున్నాయి-సీఎం కేసీఆర్
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి, తెలంగాణ మాదిరిగానే దేశాన్ని కూడా నడిపించాలని తనపై రోజురోజుకూ వత్తిడి పెరుగుతున్న విషయాలను సీఎం కేసీఆర్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి ఈ సందర్భంగా వివరించినట్టు సీఎంఓ తెలిపింది. మతతత్వ బీజేపీపై, మోడీ ప్రజావ్యతిరేక, నిరంకుశ వైఖరిపై పోరాడాలని ప్రజలు హర్షధ్వానాలతో, నినాదాలతో జిల్లాల పర్యటనల సందర్భంగా ప్రతిచోటా బహిరంగసభలో తమ మద్దతు తెలియజేస్తున్నారని చెప్పుకున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. తమ సొంత టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయి అధ్యక్ష, కార్యదర్శివర్గాలు కూడా జాతీయ పార్టీని స్థాపించి, బీజేపీని ఇంటికి సాగనంపాలని ముక్తకంఠంతో తీర్మానాలు చేస్తున్నాయని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి వివరించారన్నారు. దేశవ్యాప్తంగా పలు రైతు సంఘాల నేతలు ఇటీవలే రాష్ట్రాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో పర్యటించి, ఇక్కడి అభివృద్ధి చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారనీ, జాతీయ రాజకీయాల్లోకి వచ్చి రైతు రాజ్య స్థాపనకు కషి చేయాలని వారు డిమాండ్ చేస్తూ, తనతో మూడు రోజులపాటు చర్చల జరిపారని కూడా సీఎం కేసీఆర్ కుమారస్వామికి తెలిపారు. అనంతరం ఇరువురు నేతలు జాతీయ పార్టీ ఎజెండాపై చర్చించినట్టు సీఎంఓ తెలిపింది. దాదాపు మూడు గంటలకు పైగా సాగిన సమావేశంలోని చర్చలు అర్థవంతంగా ముగిసాయనీ, అనంతరం ప్రగతి భవన్ నుంచి తిరిగి బయలుదేరిన కర్నాటక మాజీ ముఖ్యమంత్రికి మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్ స్వయంగా వీడ్కోలు పలికారని సీఎంఓ వివరించింది.
కేటీఆర్‌తోనూ భేటీ
రాష్ట్ర మంత్రి కే తారకరామారావుతో కూడా కుమారస్వామి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వీరిరువురూ చర్చించారని ట్విట్టర్లో కుమారస్వామి పేర్కొన్నట్టు సీఎంఓ తెలిపింది.