Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమలుకు నోచని సమాన పనికి సమాన వేతనం
- ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం:
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్
నవతెలంగాణ-నల్లగొండిపాంతీయ ప్రతినిధి
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, కూలీల శ్రమను దోచుకుంటూ పనిక తగ్గ వేతనం ఇవ్వడం లేదని మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ విమర్శించారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజీపురం గ్రామంలో 'ఉపాధి' కార్మికులతో ఆమె ముఖాముఖి జరిపారు. కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అనేక పోరాటాల ఫలితంగా 2005లో సాధించుకున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చాక బడ్జెట్ లో నిధులు తగ్గిస్తూ, చట్టాన్ని బలహీన పరుస్తున్నదన్నారు. నేటికీ కూలీలకు పనికి తగ్గవేతనం లేదని, కనీసవేతనాలు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలతల ఆధారంగా కూలివ్వడంతో వారు శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం కొలతలతో సంబంధం లేకుండా కనీస కూలి రోజుకు రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూలీలు సరైన పోషకాహారం లేక అనేక రోగాలబారిన పడుతున్నారని తెలిపారు. వారి ఆహారం, వైద్యం, ఉపాధి విషయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఒంటరిమహిళలపై ప్రభుత్వం తగిన బాధ్యత తీసుకోకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పనికి వెళ్లి గాయపడిన, చనిపోయిన వారికి ప్రభుత్వపరంగా ఎక్స్‌గ్రేషియా, నష్టపరిహారం ఇవ్వడం లేదని, పని ప్రదేశాల్లో గాయపడిన, చనిపోయిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. వైద్యంతో పాటు ఇంటిదగ్గర ఉన్న సందర్భంలో రోజు కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో మంచినీళ్లు, నీడ కోసం టెంట్, మెడికల్కిట్టు ఏర్పాటు చేయాలన్నారు. పనిముట్లకు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి పార, గడ్డపార, తట్ట ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 200 పనిదినాలు కల్పించడంతోపాటు పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా హిందూ ముస్లిముల మధ్య అనైక్యత సృష్టిస్తూ మతోన్మాదాన్ని కొనసాగిస్తూ పబ్బం గడుపు కుంటుందని విమర్శించారు. స్వదేశీ నినాదం పేరుతో నిరంతరం విదేశీవిధానాన్ని అమలు చేస్తుందన్నారు. పెట్టుబడిదారులు మరింత సంపన్నులు కాగా పేదలు మాత్రం ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను మొత్తం ప్రయివేటుపరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుందని తెలిపారు. నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతుందని, నిత్యావసర ధరల పెరుగుదలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశరు. సామాన్య మానవుడు కనీసం ఒక్క పూట తిండి తినే పరిస్థితి లేదని, ఆకలి రాజ్యమేలుతుందని ఆవేదన వెలిబుచ్చారు. రానున్న కాలంలో ఉపాధిపరిరక్షణ కోసం, కనీసవేతనాల అమలు కోసం, భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు సంఘటితంగా ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐద్వా జాతీయ నాయకులు టి.జ్యోతి, తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్.వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పనిపద్మ, గిరిజనసంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, వ్యకాస జిల్లా కార్యదర్శి కొండమడుగు నర్సింహ, ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశ్, సర్పంచ్ ఏదునూరి ప్రేమలత, ఎంపీటీసీ గునుగుంట్ల కల్పన, సీపీఐ(ఎం)మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.