Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు
- నీట మునిగిన వరి, ఇతర పంటలు ొ ప్రాజెక్టులకు భారీ వరద
- పలు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
నవతెలంగాణ-విలేకరులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజులుగా వానలు వీడటం లేదు. ఆదివారం కూడా పలుజిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు కురిశాయి. వాగులు, వంకలు, చెరువులు, పొంగిపొర్లుతున్నాయి. పలువురు గల్లంతయ్యారు. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలతో పంటల నష్టం ఏర్పడింది. ప్రాజెక్టుల్లో వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. జగిత్యాల జిల్లా ముస్తాబాద్ మండలం రత్నాలకుంట వద్ద గల ఎరుకల ఒడ్డరి కాలనీలోకి వరద నీరు చేరడంతో కాలనీవాసులు నిరాశ్రయులయ్యారు. వారిని స్థానిక ప్రభుత్వ పాఠశాలలోకి తరలించారు. కోనరావుపేట మూలవాగు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లంతకుంట, చందుర్తి, వీర్నపల్లి మండలాల్లోనూ వాగులు పొంగడంతో రాకపోకలు బందయ్యాయి. పలుచోట్ల వరి, ఇతర పంటలు నీటముగినిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతంలోని రైతుల వ్యవసాయ పైపులు, పంపుసెట్లు, కరెంటు స్టాటర్లు మునిగాయి. ముందస్తు సమాచారం లేకుండా ఎల్ఎండీ నుంచి నీటిని విడుదల చేయడంతో పైపులు కొట్టుకుపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదే మండలంలో శనివారం రాత్రి పడిన పిడుగుపాటుకు గేదె మృత్యువాత పడింది. 2టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎగువ మానేరు పూర్తిగా నిండి అలుగుదూకుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తోన్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్లో అత్యధికంగా 17.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మొత్తంగా జిల్లాలో సగటున 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక కామారెడ్డిలో 10.7 సెంటీమీటర్లు వర్షపాతం కురిసింది. మొత్తంగా 6.2 సెం.మీ వర్షపాతం కురిసింది. ఇక భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇండ్లలోకి నీరు చేరింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వర్షాలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. గోదావరి నదికి భారీగా వరద పొటెత్తుతుండగా ఆదిలాబాద్ జిల్లాలోని పెన్‌గంగా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. పలు చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో వివిధ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తిర్యాణి మండలం గంభీర్రావు పేటలో గొర్రెల మందపై పిడుగుపడటంతో 150 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం అక్కేపల్లి బతుకమ్మ వాగు వద్ద బ్రిడ్జి రోడ్డు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్ష ప్రభావంతో చేతికందిన పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రాజెక్టులకు భారీ వరద
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి క్రమక్రమంగా పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 36.1 అడుగుల వద్ద ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమ య్యారు. ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని తాలి పేరు ప్రాజెక్టు 17గేట్లు పూర్తిగా ఎత్తి 78వేల క్యూసె క్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 74మీటర్లు కాగా 73.0 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉంచి మిగతా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు డీఈ తిరుపతి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి, ఎగవ, మధ్య, దిగువమానేరు జలాశయాలు నిండుకుండగా మారాయి. అత్యధికంగా శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుకు మొత్తం 4,91,780 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఇందులో ఎస్ఆర్ఎస్పీ నుంచి 1,49,760, కడెం ప్రాజెక్టు నుంచి 58,506 క్యూసెక్కులు వస్తోంది. ఇతర వాగుల ద్వారా 28,351 క్యూసెక్కుల వరద వస్తుండగా.. ప్రాజెక్టు 40గేట్లు ఎత్తిన అధికారులు దిగువకు 4.60 లక్షల క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు. మధ్యమానేరులోకి ఎగువన ఉన్న మానేరు, మూలవాగుల నుంచి 43వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకోవడంతో డ్యాం 12గేట్లు ఎత్తి దిగువకు 46,608 క్యూసెక్కులు వదులుతున్నారు. దిగువమానేరులోకీ అటు మోయతుమ్మెదవాగు నుంచి 32,808 క్యూసెక్కులు, మిడ్‌మానేరు నుంచి 46,608క్యూసెక్కుల నీరు వస్తుండగా.. ప్రాజెక్టు 14గేట్లు ఎత్తి దిగువకు 96,539 క్యూసెక్కులు వదులుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 58 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. 17.08 టీఎంసీల నీటిమట్టానికి గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 16.87 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎనిమిది వరద గేట్ల ద్వారా 80,800 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 1.75 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, 30 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 1,90,360 క్యూసెక్కుల నీరు జూరాలకు చేరింది. జలాశయ నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.963 టీఎంసీల నీరుంది. 33,890 వేల క్యూసెక్కుల నీటిని ఉపయోగించి యూనిట్లలో6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి యథావిధిగా నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 640 క్యూసెక్కులు, కుడి కాల్వకు 252 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 100 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
పలు ప్రమాదాల్లో నలుగురు మృతి
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఇక్బాల్‌పూర్ వద్ద ప్రధాన రహదారిపై నుంచి వెళ్తున్న మ్యాజిక్ వాహనంపై ఒక్కసారిగా భారీ వృక్షం విరిగిపడింది. ఈ ఘటనలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన వాహనం డ్రైవర్ బుచ్చిరాజు(45), ప్రయాణికుడు రవి(35) అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడు నిఖిల్ తీవ్రంగా గాయపడటంతో మెట్పల్లి ఆస్పత్రికి తరలించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ వాగులో కారు కొట్టుకుపోయిన ప్రమాదంలో జగిత్యాల జిల్లా చల్గల్కు చెందిన బుర్ర గంగు, ఆమె మనువడు కిట్టు మరణించారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. వీరు చల్గల్ నుంచి వేములవాడ మీదుగా హైదరాబాద్‌కు బయల్దేరారు.