Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్హోదాలో రాజ్యాంగ ఉల్లంఘన..
- ప్రజల జీవితాలు చదివిన వాడే నిజమైన నాయకుడు
- దేశానికి సెక్యూలరిజం
- ఆలోచన అవసరం :'ప్రజల గొంతుక'పుస్తకావిష్కరణలో మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్,
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
తెలంగాణ రైతాంగ సాయుధపోరాటాన్ని వక్రీకరించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాసిన 'ప్రజల గొంతుక' పుస్తకావిష్కరణ కార్యక్రమం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని విఘ్నేశ్వర ఎస్టేట్‌లో ఆదివారం నిర్వహించారు. పుస్తకావిష్కరణను మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావుతో కలిసి నాగేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ సాయుధపోరాటంలో బీజేపీ పాత్ర లేనప్పటికీ తామే పోరాటంలో పాల్గొన్నామంటూ చరిత్రను వక్రీకరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిందని, నాడు కమ్యూనిస్టులు వీరోచతమైన పోరాటాలు చేశారని, ఆ పోరాటంలో ఎంతో మంది ముస్లిములు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందూ ముస్లిముల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ రాజకీయంగా లబ్దిపొందాలని చూస్తోందన్నారు. ఎన్నికల నాటికి రజాకార్ల ఫైల్ సినిమా తీసి ప్రజల మధ్య మతవిధ్వేషాలు సృష్టించబోతున్నారని చెప్పారు. దేశానికి వామపక్షాల భావజాలం ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు. రాజ్యాంగమైన పదవిలో ఉంటూ గవర్నర్ రాజ్‌భవన్‌ను పార్టీ వేదికగా మార్చడం సరైంది కాదన్నారు. గవర్నర్ హౌదాలో ఉండి రాజకీయాలు ప్రస్తావించడం రాజ్యాంగ ఉల్లంఘననేనని ఉద్ఘటించారు. ప్రజలను ఆలోచింపజేసే పుస్తకమే 'ప్రజల గొంతుక' అని అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా జీవితాన్ని రంగన్న గడుపుతున్నాడని, ఆయన ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తిన అంశాలను ప్రజలు గుర్తించుకోవాలని తెలిపారు. పుస్తకాలు భౌతికశక్తిగా మారుస్తాయని అందులో భాగమే ప్రజల గొంతుక పుస్తకమని అన్నారు. రంగన్న జీవితం అంతా ప్రజలకోసమే పని చేస్తున్నారని, దశాబ్దాల పాటు జెండా, ఎజెండా సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లులక్ష్మి, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్పొరేషన్ చైర్మెన్ ఇస్లావత్ రామచంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, జెడ్పీ మాజీ చైర్మెన్ సీడీ రవికుమార్, మానవ హక్కుల వేదిక నాయకులు సుబ్బారావు, సీపీఐ(ఎం) నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మల్లు నాగార్జున్‌రెడ్డి, రాష్ట్ర కమిటీసభ్యులు డబ్బికార్ మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.