Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్ వేదికగా ఈనెల 14నుంచి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాలుగో మహాసభ జరగనున్నదని, దాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు విద్యార్థులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముకుందలాల్ మిశ్రాభవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమాలకు పురుడు పోసిన కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభ నిర్వహించనుండటం గర్వకారణమన్నారు. ఈ మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరవుతున్నట్టు తెలిపారు. మొదటిరోజు తెలంగాణ చౌరస్తా నుంచి ఎస్ఆర్అర్ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించి సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. సభకు ఎస్ఎఫ్ఐ జాతీయ మాజీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు శివదాసన్ హాజరవుతున్నట్టు చెప్పారు. మహాసభల్లో విద్యారంగ సమస్యలపైన లోతైన చర్చ చేసి రాబోయే మూడేండ్ల కాలంలో భవిష్యతు ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. విద్యారంగాన్ని రాష్ట్ర సర్కారు పూర్తిగా విస్మరించిందని, స్కాలర్షిప్లే రాష్ట్రవ్యాప్తంగా రూ.3380కోట్ల బకాయిలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సం'క్షేమ' హాస్టళ్లు కనీసం సొంత భవనాలు లేక అరకొర వసతుల నడుమ పేద, మధ్యతరగతి విద్యార్థులు అవస్థలు పడుతున్నారని అన్నారు. ఒకే గదిలో 50మందికిపైగా విద్యార్థులకు వసతి కల్పిస్తూ కనీసం సరిపడా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. నిత్యవసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో హాస్టల్ విద్యార్థులకు ఒక్కొక్కరికీ రోజుకు ఇచ్చే రూ.35 ఏమూలకు సరిపోతుందని ప్రశ్నించారు. మహాసభ ర్యాలీలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గజ్జల శ్రీకాంత్, శనిగరపు రజనీకాంత్, రాష్ట్ర కన్వీనర్ మక్కాపెల్లి పూజ, నగర అధ్యక్ష, కార్యదర్శులు రోహిత్, అరవింద్, జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు.