Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్యాగధనుల స్ఫూర్తితో అడవులను పరిరక్షిద్దాం
- అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: అటవీ అమరవీరుల సంస్మరణ సభలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నవతెలంగాణ-ధూల్‌పేట్
అటవీ సంరక్షణ, పునరుద్ధరణ పనుల్లో తెలంగాణ భేష్ అని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులోని స్మారక స్థూపం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అమరులైన అటవీ అధికారుల సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉందని తెలంగాణ లో పర్యటించిన కేంద్రమంత్రులు, సీఎంలు, ఇతర రాష్ట్రాల మంత్రులు కితాబునిస్తున్నారని అన్నారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన ఉత్తర ప్రదేశ్ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్ హరితహారంలో నాటిన మొక్కలు, అటవీ పునరుద్ధరణ పనులు బాగున్నాయని అభినందించారని తెలిపారు. 1984 నుంచి ఇప్పటివరకు మన రాష్ట్రంలో 21 మంది అటవీ అధికారులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రకృతి వనరులను రక్షించడంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతర సేవలందిస్తున్నారని తెలిపారు. వన్యప్రాణుల, స్మగ్లర్లు అడవుల్లో ఉన్నప్పటికీ, భూ ఆక్రమణదారులు దాడులు జరుపు తున్నప్పటికీ భయపడకుండా, అన్నింటినీ ఛాలెంజ్‌గా తీసుకుని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అటవీ అధికారులు, సిబ్బంది పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. అమరులైన వారి కుటుంబా లను అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చారు. 'జంగిల్ బచావో-జంగిల్ బడావో' నినాదం ద్వారా అడవుల రక్షణతో పాటు క్షీణించిన అడవుల పునరుజ్జీవనం కోసం ప్రజల భాగస్వామ్యంతో పెద్ధ ఎత్తున చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. అడవుల రక్షణతో పాటు తాగునీటి కోసం వన్యప్రాణు లు జనారణ్యంలోకి రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, శాఖాహార జంతువుల కోసం గడ్డి క్షేత్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
'2021-22లో అటవీ అధికారులు అటవీ రక్షణలో భాగంగా మొత్తం 11,669 కేసులను నమోదు చేసి, రూ.14.07 కోట్ల జరిమానాను విధించారు. రూ.7.31 కోట్ల విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నారు. 1634 వాహనాలను జప్తు చేశారు. 1133 అటవీ భూ ఆక్రమణ కేసులు నమో దు చేశారు. ఇక అటవీ శాఖను బలోపేతం చేయడా నికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగులను, సిబ్బంది నియామకాలను ఎప్పటికప్పు డు భర్తీ చేస్తోంది. ఈ సంవత్సరం 92 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీ సర్లు, 14 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అంతేకాకుండా అటవీ అధికారు లు, సిబ్బందికి 2173 వాహనాలను అందజేసిందని తెలిపారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, స్పెషల్ సీఎస్ శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్.ఎం. డొబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైశ్వాల్, అటవీ శాఖ సలహాదారు ఆర్.శోభ, రిటైర్డ్ పీసీసీఎఫ్ పీ. మల్లిఖార్జున్ రావు, మునీంద్ర, జూపార్క్ క్యూరేటర్ ఎస్ రాజశేఖర్, అసిస్టెంట్ క్యూనేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.