Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భాషలోని అన్ని ప్రక్రియలకు అదే వేదిక : ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పాటలో భాష, భావుకత, రసం, ధ్వని వరుస ఉంటేనే అది రక్తి కడుతుందనీ, ఇవన్నీ తెలుగు సినీ గీతాల్లో ఉన్నాయని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. సకల సాహిత్య సమాహారంగా సినీగీతం నిలుస్తుందనీ, భాషలోని అన్ని ప్రక్రియలకూ అదే వేదిక అవుతుందని స్పష్టంచేశారు. ఆదివారంనాడు తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (టీపీఎస్కే), సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే), విజ్ఞాన దర్శిని సంయుక్తాధ్వర్యంలో 'సినిమా పాటల్లో భావోద్వేగాలు-భాషా ప్రయోగాలు' అంశంపై ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు. సినిమా అనేది అతిపెద్ద ప్రసార మాధ్యమం అనీ, దానిద్వారా జనం భాషలో సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం సులభమవుతుందని వివరించారు. కవిత్వం తర్వాతే పాట అన్నారనీ, కానీ పాటకు పట్టం కట్టి, రచయితలను త్వరగా సమాజానికి పరిచయం చేసిన ఘనత సినిమాదే అని విశ్లేషించారు. సినీ పాటకు 91 ఏండ్లు అనీ, తొలిపాట రాసిన ఘనత చందాల కేశవదాసుదే అని గుర్తుచేసుకున్నారు. ఓ మహాకావ్యం రాయడం కంటే సినిమా పాట రాయడమే కష్టమైన పని అనీ, కావ్యాన్ని ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చనీ, సినిమా పాట ఒక్కసారి జనంలోకి వెళ్తే ఇక మార్చే అవకాశమే ఉండదని చెప్పారు. సినిమా పాటలు సాహితీ వైభవాన్ని సమకూర్చుకోవడంలో పరిపుష్టపాత్ర పోషిస్తాయనీ, వాటిని తక్కువ అంచనా వేయొద్దనీ అన్నారు. సినిమా పాటల్లో పాండిత్యం, గ్రాంధీకం ప్రయోగించట్లేదంటూ... కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, వేటూరి సుందరరామ్మూర్తి, సుద్దాల హనుమంతు, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి పలు రచయితల సినీ గీతాల పద ప్రయోగాలను ఉదహరిస్తూ ప్రసంగాన్ని కొనసాగించారు. సినీగీతాల్లో ప్రజలే శబ్దార్ధ నిఘంటువులు అనీ, వాడుక భాష, యాసలోంచే అవి పుట్టుకొచ్చి, ప్రేక్షక హృదయాలను చేరతాయని విశ్లేషించారు. చెడుతో పాటు మంచిని కూడా సినిమా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చన్నారు. ప్రజా కవిత్వాన్ని జన వాగ్గేయకారులు, సినీ కవులు మాత్రమే రాస్తారని గుర్తుచేశారు. రెండున్నర గంటలకు పైగా ఆయన ఇదే అంశంపై తన ప్రసంగాన్ని కొనసాగించారు. సభికులు కూర్చున్న చోటి నుంచి కదలకుండా ఆసక్తిగా ఆయన మాటల్ని ఆలకించడం విశేషం. కార్యక్రమానికి ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ అధ్యక్షత వహించారు. భూపతి వెంకటేశ్వర్లు (టీపీఎస్కే), రమేష్ (విజ్ఞాన దర్శిని) వేదికపై ఆశీనులయ్యారు.