Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ, కేసీఆర్ కుట్రలకు సామాన్యులే సమిధలు
- కమలదళమిచ్చిన సుపారీతో సీఎం పరోక్ష సహకారం
- ఆ నలుగుర్ని కేసీఆర్ ఎందుకు కలవరు : టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీతో దేశానికి ప్రమాదం పొంచి ఉందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకు ఆపార్టీ నేతలు దేశంలో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. అధికారం కోసం జరుగుతున్న కుట్రలో సామాన్యులు సమిధలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ మోడీ, ప్రధాని అయ్యేందుకు, కేసీఆర్ సీఎం కావడానికి ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు. ఆదివారం హైదబాద్‌లోని తన నివాసంలో పార్టీ నేతలతో కలిసి రేవంత్ విలేకర్లతో మాట్లాడారు. అంతకు ముందు మునుగోడు అభ్యర్థి స్రవంతితోపాటు ఆశావాహులు రేవంత్‌తో సమావేశమయ్యారు. కేసీఆర్ ప్రయత్నమంతా యూపీఏ కూటమిని విచ్ఛిన్నం చేసేందుకేనని రేవంత్ విమర్శించారు. మోడీ ఇచ్చిన సుపారీ ఒప్పందంతో కేసీఆర్ ఆ పార్టీకి పరోక్షంగా సహకారమందిస్తున్నారని ఆరోపించారు.ఎన్డీఏను గద్దెదించాలనుకుంటే ముందు వారి భాగస్వాములను బయటకు తీసుకరావాలని సూచించారు. మునుగోడు కాంగ్రెస్ నాయకుల స్ఫూర్తి ఆదర్శనీయమన్నారు. అక్కడ పార్టీ గెలుపు కోసం కషి చేస్తామంటూ నేతలు హామీ ఇచ్చినట్టు తెలిపారు. రాష్ట్రంలోని నాయకులంతా వారి స్ఫూర్తితో పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పల్లె రవికుమార్, కైలాష్ నేత, కృష్ణారెడ్డి మునుగోడు టికెట్ ఆశించినా...కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్రవంతిని అధిష్టానం అభ్యర్థిగా ఎంపిక చేసిందన్నారు. టికెట్ రాకపోవడంతో వారు కొంత అసంతృప్తితో ఉన్నా...పార్టీ నిర్ణయాన్ని గౌరవించడం అభినందనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టేందుకు మునుగోడు ఉప ఎన్నిక కీలకమన్నారు.
కేసీఆర్ కొత్త పార్టీలో జేడీయూను విలీనం చేస్తారా?
కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, సీఎం కేసీఆర్ భేటీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు. కేసీఆర్ పెట్టే కొత్త పార్టీలో కుమారస్వామి పార్టీని విలీనం చేస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ యూపీఏ భాగస్వామ్య పక్షాలను దూరం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌షిండేలను కేసీఆర్ ఎందుకు కలవరని నిలదీశారు. కాంగ్రెస్‌తో ఉన్నవారినే కలవడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. విభజించు, పాలించు అనే బ్రిటీష్ విధానాన్ని బీజేపీ అమలు చేస్తున్నదన్నారు.
గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించండి
సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ లేఖ
గ్రామ రెవెన్యూ సహాయకులు బతుకులు అగమ్యగోచరంగా మారాయనీ, వారి సమస్యలను పరిష్కరించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈమేరకు ఆదివారం సీఎంకు ఆయన లేఖ రాశారు. వీఆర్ఏల తో వెంటనే చర్చలు జరపాలని కోరారు. ఉద్యోగ భద్రత లేని కారణంగా అకాల మరణాలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వారితో గొడ్డు చాకిరీ చేయించుకోవడమే తప్ప, వారికి హక్కులను రక్షించడం లేదని పేర్కొన్నారు. స్వయంగా హామీ ఇచ్చిన విధంగా వీఆర్ఎలకు పే స్కేల్ అమలు చేయాలనీ, అర్హులైన వీఆర్ఎలకు పదోన్నతులు కల్పించాలని కోరారు. సొంత గ్రామాల్లో వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమ్మె కాలంలో, విధి నిర్వహణలో చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న వీఆర్ఏల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలనీ, ఆ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.