Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగానికి వ్యతిరేకం
- విద్యుత్ సవరణ బిల్లును విరమించుకోవాలి: మండలిలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్తు సవరణ బిల్లు-2022 అనేది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేది.. రాజ్యాంగానికి వ్యతిరేకమైందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. వెంటనే ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం శాసనమండలిలో 'కేంద్ర విద్యుత్ బిల్లు - పర్యవసనాలు' అనే అంశంపై జరిగిన లఘు చర్చలో నర్సిరెడ్డి మాట్లాడారు. ఆ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పూర్తిగా తిరస్కరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దాని స్థానంలో దేశ ప్రజలు, సామాన్యులు, రైతులకు మేలు చేసే ఇంకో బిల్లును తీసుకురావాలని సూచించారు. విద్యుత్ రంగంలోకి ప్రయివేటు పెట్టుబడిదారులు ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ఉదహరిస్తూ, టెలి కమ్యూనికేషన్ రంగంలో తొలినాళ్లలో జియో తక్కువ రేట్లు పెట్టి క్రమంగా పెంచిన తీరును వివరించారు. డిస్కంలను ప్రయివేటీకరిస్తే విద్యుత్ వస్తుందో, రాదో తెలియదు కానీ...ప్రతి ఒక్కరికీ విద్యుత్ బిల్లులు విపరీతంగా వచ్చి తీరుతాయని చెప్పారు. యూపీఏ హయంలో 2జీ స్పెక్ట్రం రూ.1.85 లక్షల కోట్లకు అమ్ముడవుతే ప్రస్తుతం 5జీ స్పెక్ట్రం కేవలం రూ. 1.5 లక్షల కోట్లకే అమ్ముడు పోయిందని వివరించారు. వేలంలో దానికి కనీసం రూ.ఐదు లక్షల కోట్ల నుంచి రూ.ఆరు లక్షల కోట్లు రావాల్సి ఉందని నర్సిరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
'విద్యుత్ జనరేషన్‌ను ప్రయివేటీకరిస్తే సమస్యలు తలెత్తుతాయి. రాష్ట్రంలో పునరుత్పాదకత విద్యుత్ కోసం రాయితీ ఇవ్వాలి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కరెంటు కంటే ఎక్కువగా కొనుగోలు చేయాలంటూ ఆదేశిస్తున్న కేంద్రం... రాయితీలు ఇవ్వకపోవడమేంటి..? దేశాన్ని ఇద్దరు అమ్ముకుంటుంటే మరో ఇద్దరు కొంటున్నారు. ఇలా అమ్మే ఇద్దరు పోతే దేశం బాగుపడుతుంది...' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేటు ఎక్కువగా ఉన్న విదేశీ బొగ్గునే కొనుగోలు చేయాలని ఆంక్షలు విధించడం వెనుక బీజేపీ ఆప్తుడు ఆదానీ ప్రయోజనం దాగుందని స్పష్టం చేశారు. విద్యుత్ సంస్థలకు పంపిణీ చేసిన రుణాలను ఆపడం సరికాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎవరెంత బ్యాలెన్స్ ఉన్నారో ఆ మేరకు నిష్పక్షపాతంగా నోటీసులివ్వాలని సూచించారు. కేవలం తెలంగాణకు ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల పెన్షన్లు, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్‌లకు సంబంధించి ఆంధ్ర జెన్కో నుంచి తెలంగాణ జన్కోకు రావాల్సిన రూ.2,172 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టిజన్లను క్రమబద్ధీకరించారనీ, అయితే ఇంకా కొన్ని సమస్యలున్నాయంటూ, వాటిని పరిష్కరించాలని కోరారు. విద్య, విద్యుత్ రంగాల ప్రయివేటీకరణను వ్యతిరేకించాలని సూచించారు.
కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్
లఘు చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో టీఆర్ఎస్ సభ్యులు పలుమార్లు అడ్డు తగిలారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేసే పరిస్థితి లేదనీ, వాటిని తగ్గించడంతో రైతులంతా ఒకేసారి పంపులను ప్రారంభిస్తుండటంతో ట్రాన్స్ ఫార్మర్లపై భారం పడి కాలిపోతున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంలో టీఆర్ఎస్ సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి అడ్డుతగిలారు. జీవన్‌రెడ్డి అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇందుకు జీవన్‌రెడ్డి బదులిస్తూ జగిత్యాలలో ప్రతి రోజు 15 నుంచి 20 ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయని తెలిపారు. తాను చెప్పేది అబద్ధమైతే సబ్ స్టేషన్ల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జోక్యం చేసుకుని... మంత్రి ఇచ్చిన నోట్లో ఓవర్ లోడ్ సమస్యలను అధిగమించేందుకు రూ.287 కోట్లు విడుదల చేసినట్టు పేర్కొన్నారని గుర్తు చేశారు. అనంతరం పల్లా మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల పంపుసెట్లకు 24 గంటల కరెంటునిసుతన్నామని చెప్పారు. తిరిగి జీవన్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా పరిషత్ సభ్యులు... విద్యుత్ మార్గాలను పెంచాలంటూ తీర్మానించారనీ, కావాలంటే పరిశీలించుకోవచ్చని సూచించారు. ఈ సమయంలో టీఆర్ఎస్ సభ్యుడు కడియం శ్రీహరి కలుగజేసుకుని చర్చ పక్కదారి పడుతోందని చెప్పారు. చర్చలో టీఆర్ఎస్ సభ్యుడు బండా ప్రకాశ్ కూడా పాల్గొన్నారు.
వెనుకబడిన దేశం...
కేంద్రం రూపొందించిన విద్యుత్ బిల్లును పలువురు టీఆర్ఎస్ సభ్యులు నిర్ద్వందంగా వ్యతిరేకించారు. వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ బిల్లుతో ప్రజలకు జరిగే నష్టాన్ని వివరించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని కోరారు. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలతో భారతదేశం వెనుకబడిందని మధుసూదనాచారి విమర్శించారు. ఐలాండ్, నార్వే, ఖతర్, అమెరికా, చైనా తదితర దేశాల సగటు విద్యుత్ వినియోగం భారతదేశం కన్నా చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. ప్రగల్భాలు పలికే బీజేపీ నాయకుల పాలనలో ఉన్న తలసరి విద్యుత్ వినియోగం తెలంగాణ కన్నా చాలా తక్కువ అని గణాంకాలతో సహా వివరించారు. ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీ మాట్లాడుతూ విద్యుత్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్ధతు తెలిపారు. బండా ప్రకాష్ మాట్లాడుతూ బీజేపీ విధానాల కారణంగానే అంబానీ,ఆదానీలు ప్రపంచ కుబేరులుగా మారుతున్నారని విమర్శించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్థన్ రెడ్డి, రఘోత్తం రెడ్డి, వాణిదేవి, భాను ప్రసాద్, తాత మధు, ఎగ్గే మల్లేశం, డాక్టర్ యాదవరెడ్డి తదితరులు చర్చలో పాల్గొన్నారు.