Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ తర్వాత దేవుడు కూడా కాపాడలేడు
- మీకొచ్చింది 36 శాతం ఓట్లే..విపక్షాలన్నీ ఒక్కటైతే ఉంటారా?
- కాస్కోండి..దేశంలో విప్లవం రాబోతున్నది
- అమిత్‌షా..దమ్ముంటే అన్ని పార్టీలనూ బ్యాన్ చెరు
- 11 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చటం దుర్మార్గం
- ఉన్నదే ముగ్గురు..ఇక్కడా కూలుస్తారంట..
- తెలంగాణ ఉద్యమాల గడ్డ..మీ ఆటలు సాగవ్
- ఆర్టీసీని అమ్మేయాలంటూ మాపై కేంద్రం ఒత్తిడి
- రూ.4 వేలున్న టన్ను బొగ్గును 30 వేలకు కొనాలనటం సంస్కరణ అవుతుందా?
- మీటర్లు పెడితేనే ఎఫ్ఆర్బీఎమ్ ద్వారా ఏటా రూ.5 వేల కోట్ల అప్పిస్తరంట
- పార్లమెంట్‌కు డాక్టర్ బీఆర్ అంబ్కేదర్ పేరు, విద్యుత్ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని తీర్మానిస్తాం : అసెంబ్లీలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'కేంద్రం పిట్ట బెదిరింపులకు భయపడం. బీజేపీ సీఎంలు, మంత్రులు ఎన్కౌంటర్ చేసేస్తమంటున్నరు. జాతీయ జెండానే మార్చేస్తమంటున్నారు. డెమోక్రసీ ఉండొ ద్దంటున్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీనికోసమేనా రాజ్యాంగం ఉంది? దేశంలో ఏక పార్టీ విధానం ఉండాలంట. ఇతర పార్టీలు ఉండకూడదని అమిత్‌షా మాట్లాడుతున్నాడు. ఇది ప్రజాస్వామ్యమా? మహాత్ముడు పుట్టిన గడ్డమీద, బుద్ధుడు తిరగాడిన నేల మీద మరగుజ్జుల మాటలు వినాలా? ఎవరికైనా అధికారం శాశ్వతం కాదు. చరిత్రలో అధికార దర్పంతో వ్యవహరించిన హిట్లర్, ముస్సోలిని, నెపోలియన్ లాంటి వారే కాలగర్భంలో కలిసిపోయారు. ప్రజలు అధికారం ఇవ్వకున్నా ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసుకుంటూ పోతున్న బీజేపీకీ పోయే కాలం దగ్గర పడ్డది. అధికారం బాధ్యత. రాచరికం కాదు. మోడీ ప్రధానిగా నీవుండేది 18 నుంచి 20 నెలలే. అహంకారం నెత్తికెక్కిన బీజేపీని ఇక దేవుడు కూడా కాపాడలేడు' అని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ సాక్షిగా కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తర్వాత వచ్చే ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం శానసనభలో 'కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు-పర్యవసానాలు' అంశంపై లఘ చర్చ జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ దీన్ని ప్రారంభించారు. దీనిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ బలాల, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే సభ్యులు సండ్ర వెంకటవీరయ్య మాట్లాడారు. అనంతరం సీఎం కేసీఆర్ సుధీర్ఘంగా ప్రసంగించారు. పార్లమెంట్‌కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలనీ, విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆ సంస్కరణలు పేదలు, రైతుల పాలిట మరణశాసనం వంటివని తెలిపారు. అప్రజాస్వామికంగా, కిరాతకంగా, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ బీజేపీ 11 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసిందని విమర్శించారు. పైగా, ఆ ప్రభుత్వాలను కూల్చామని బీజేపీ నేతలు సిగ్గులేకుండా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో మూడు తోకలు లేని ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలుస్తరంట..అదీ ఎంతకాడికో చూసుకుంటామన్నారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ అనీ, బీజేపీ ఆటలు ఇక్కడ సాగవని చెప్పారు. షిండేలు, బొండేలు ఎవరి కోసం? దేశంలోని అందరూ ఒక్కటై గొంతుకొస్తే బీజేపీ ఎక్కడకు పోతుందని ప్రశ్నించారు. జైల్లో పుట్టిన జనతాపార్టీ 50 రోజుల్లో దేశంలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో బీజేపీకి వచ్చింది 36 శాతం ఓట్లేననీ, ఎన్నడూ 50 శాతం ఓట్లు దాటలేదన్నారు. మిగతా 64 శాతం మంది ఆ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నారనీ, ఆ పార్టీకి అహంకారం తగదని హితవు పలికారు. తెలంగాణ బార్డర్‌లోని పక్క రాష్ట్రాల గ్రామాల ప్రజలు ఇక్కడి పథకాలు తమ దగ్గర పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. తాను జాతీయ పార్టీ పెట్టడం ఖాయమని స్పష్టం చేశారు. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా దేశంలోని రైతులను సంఘటితం చేసి ముందుకు సాగుతామన్నారు. చేగువేరా, నెల్సన్ మండేలా లాంటి మహనీయ వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు.
విభజన హామీలపై తెలంగాణకు బీజేపీ అన్యాయం
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని సీఎం కేసీఆర్ విమర్శించారు. నరేంద్రమోడీ ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలోనే 460 మెగావాట్ల సీలేరు విద్యుత్ ప్రాజెక్టును ఏపీలో కలిపి తెలంగాణ గొంతు నులిమేసిందన్నారు. ఏడు మండలాలను ఏపీలో అప్రజాస్వామికంగా ఆర్డినెన్స్ ద్వారా కలిపిందని చెప్పారు. ఆనాడే మోడీని ఫాసిస్టు పీఎం అని తొలిసారి కామెంట్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ ప్రాజెక్టుపై కేంద్రానికి అనేకమార్లు లేఖ రాసినా పట్టించుకోలేదని విమర్శించారు. కొత్త చట్టాలతో రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు.
ఏపీ, యూపీలో మీటర్లు పెట్టారు..
విద్యుత్ అనే అంశం ఉమ్మడి జాబితాలో ఉందనీ, కనీసం రాష్ట్రాలను సంప్రదించకుండా దొడ్డిదారిన విద్యుత్ సవరణ బిల్లును తెరపైకి తెచ్చిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. పార్లమెంట్లో ఎవరైనా ప్రశ్నిస్తే మూకదాడులు చేస్తున్నారన్నారు. ఏం జరుగుతుందనే విషయాన్ని పసిగట్టేలోపే బిల్లులను చట్టాలుగా మారుతున్నాయనీ, అసలు చర్చలే జరపట్లేదని ఆరోపించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మీటర్లు పెట్టారనీ, అక్కడ రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. దీనిని వ్యతిరేకిస్తే తొక్కి చంపుతామన్నట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మీటర్ల పేరుతో రైతులు, పేదలను దోచుకునే ఒక దుర్మార్గమైన చర్య అని నొక్కిచెప్పారు.
భూటాన్ కంటే మన దేశ తలసరి వినియోగమే తక్కువ
తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్, గృహావసరాలకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నది వాస్తవం కాదా? అని అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్రం సహకరించకపోయినా ఐదున్నర నెలలు జెన్కో,ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, తమ విద్యుత్ సిబ్బంది కష్టపడి వ్యవస్థను మెరుగుపర్చారన్నారు. ఇతర ఖర్చులను తగ్గించుకుని మరీ విద్యుత్ రంగంపై దృష్టి సారించామని చెప్పారు. దాని ఫలితంగానే 2014లో తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 970 యూనిట్లు ఉంటే నేడు 2126 యూనిట్లకు చేరిందని సగౌరవంగా చెప్పారు. అదే సమయంలో దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 2014లో 957 యూనిట్లు ప్రస్తుతం తెలంగాణ వినియోగంతో కలుపుకుని 1255 యూనిట్లకు చేరిందని తెలిపారు. చిన్నదేశమైన ఐస్‌ల్యాండ్‌లో తలసరి విద్యుత్ వినియోగం 51,696 యూనిట్లు, అమెరికాలో 12,154 యూనిట్లు, చైనాలో 6,312 యూనిట్లు, చివరకు మనపక్కనున్న అతిపేద దేశమైన భూటాన్‌లోనూ 3,126 యూనిట్లు ఉందని గణాంకాలతో వివరించారు. ఇంటర్నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ 140 దేశాల్లో నాణ్యమైన విద్యుత్ వినియోగంపై సర్వే చేస్తే మన దేశం 104వ స్థానంలో నిలిచిందని చెప్పారు.
దేశంలోని విద్యుత్ ఉద్యోగులు తిరగబడాలే..
సింగరేణి ద్వారా రూ.4 వేలకు టన్ను దొరికే బొగ్గును.. రూ.30 వేలకు కొనమని చెప్పడం సంస్కరణ ఎలా అవుతుందంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. విశ్వగురు అంటే పేదలకు సహాయం చేయాలిగానీ వారి దక్కేది, నోటి కాడి ముద్దను లాక్కోవడం కాదని విమర్శించారు. విేద్యుత్ సంస్కరణ బిల్లులు వెనక్కి తీసుకోవాలని సభా ముఖంగా డిమాండ్ చేశారు. దేశంలో విద్యుత్ తయారీకి అద్భుత వనరులున్నా వినియోగించుకోలేని దుస్థితిలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. దేశంలో 4,04,178 మెగావాట్ల స్థాపిత విద్యుచ్ఛక్తి సామర్థ్యం ఉన్నా..ఏనాడూ 2,10,793మోగావాట్లకు మించి వాడలేదని గణాంకాలతో వివరించారు. కనీసం చెత్త నుంచి విద్యుత్‌ను తయారు చేయలేని దుస్థితిలో కేంద్ర పాలకులు ఉన్నారని విమర్శించారు. నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు అందిస్తున్న తెలంగాణకు ఏవిధంగానైనా అడ్డుకట్ట వేయాలనే కుట్రతో మోడీ సర్కారు ముందుకు సాగుతున్నదని విమర్శించారు. బెల్కు ప్రభుత్వ ఆర్డర్లు కూడా ఇవ్వొద్దని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యుత్ సవరణ బిల్లు చట్టరూపం దాల్చితే రాష్ట్రంలో 98 లక్షల కుటుంబాల ప్రభావం పడే ప్రమాదం ఉందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. చిన్నపరిశ్రమలు, కుటీర పరిశ్రమల దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. దేశంలోని 20 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్లందరి ఉద్యోగాలు పోతాయనీ, అదే సమయంలో పేదలకు అందే సబ్సిడీలు పోతాయని తెలిపారు. ఆ ఉద్యోగులంతా కేంద్రంపై తిరగబడి పోరాటం చేయాలని సూచించారు. కేంద్రం ఒత్తిడితోనే ఉదరులో చేరామనీ, దాని వల్ల ఆర్థికంగా నష్టపోయామని వివరించారు. రైతులే వ్యవసాయం నుంచి తప్పుకునేలా చేసి షావుకార్లకు విద్యుత్, వ్యవసాయాన్ని అప్పగించే కుట్రకు బీజేపీ ప్రభుత్వం పూనుకున్నదని ఆరోపించారు. ధాన్యం కొనాలని కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ దగ్గరకెళ్తే అవహేళనగా మాట్లాడారన్నారు. ఇప్పుడు నూకల ఎగుమతులపై ఆంక్షలు పెట్టారన్నారు.
ఆర్టీసీని అమ్మితే రూ.1000 కోట్ల బహుమతి ఇస్తరంట
ఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం సూచనలు చేస్తున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రయివేటుపరం చేస్తే రూ.1000 కోట్ల బహుమతి ఇస్తామని ఆఫర్ కూడా ఇస్తున్నారని తెలిపారు. 'ఆర్టీసీని అమ్మేయండి' అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి పంపిన లేఖలను చూపెట్టారు. కొందరు నచ్చిన షావుకార్లకు కేంద్రం అన్నింటినీ అమ్మేస్తున్నదని ఆరోపించారు. చివరకు వ్యవసాయం, విద్యుత్ మాత్రమే మిగిలాయన్నారు. ధాన్యం ఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్రం మాయ మాటలు చెబుతోందని, రైతులు వ్యవసాయం చేయలేమంటే.. కార్పొరేట్ కంపెనీలను రంగంలోకి దించాలని కేంద్రం ఆలోచన చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. మీటర్లు పెడితే ఎఫ్ఆర్బీఐ ద్వారా అప్పు ఇస్తామనే షరతు కారణంగా తెలంగాణ రూ. 25 వేల కోట్లు నష్టపోతుందన్నారు. విద్యుత్ మీటర్లు పెట్టాల్సిందేనని కేంద్రం అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆర్ఈసీ లోన్లు ఆపాలని కొత్త కండీషన్ పెడుతున్నారని, దీనిపై కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.
ఒక్క హామీనైనా నెరవేర్చారా?
ప్రధాని మోడీ ఇచ్చిన ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నారా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. పైగా, దేశంలో రూపాయి విలువ వేగంగా పడిపోతున్నదనీ, నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి అకౌంట్లో రూ15 లక్షల జమ ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని 20 లక్షల ఖాళీలను ఎందుకు భర్తీ చేయట్లేదని నిలదీశారు. నల్లధనం తెప్పిస్తానన్న హామీ ఏమైందన్నారు. ఒక్క కొత్త ప్రాజెక్టునైనా కట్టించారా? అని అడిగారు. సైన్యం రిక్రూట్మెంట్లో అగ్నిపథ్ సంస్కరణలు దారుణమన్నారు. అభ్యర్థుల ఆందోళనను పోలీసులతో అడ్డుకున్నా..వారి గుండెల్లో నెలకొన్న వ్యతిరేకతను తొలగించగలరా? అని ప్రశ్నించారు. మేకిన్ ఇండియా పేరుతో బీజేపీ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. పతంగుల మాంజాలు, జాతీయ జెండాలు, గీసుకునే బ్లేడ్లు, ఇలా అన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నదని తెలిపారు. చివరకు విద్యుత్ సంస్కరణల్లో భాగంగా చెబుతున్న స్మార్ట్ మీటర్లు కూడా చైనా నుంచే తెప్పించాల్సిందేనన్నారు.
రాష్ట్రానికి రావాల్సినవి ఇప్పించదంట...ఏపీకైతే కట్టాలంట...
ఏపీ నుంచి తమకు రూ.17,828 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని చెబుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. అదే ఏపీకి ఇవ్వాల్సిన రూ.3 వేల కోట్లకు 18 శాతం వడ్డీ కలిపి రూ.6 వేల కోట్ల రూపాయలను చెల్లించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందన్నారు. అయినోళ్లకు ఆకుల్లో.. కానోళ్లకు కంచాల్లో పెట్టడమే కేంద్రం విధానమా? అని ప్రశ్నించారు. కృష్ణపట్నంలో కూడా తెలంగాణకు వాటా ఉందని తెలిపారు. తాను చెప్పేది అబద్ధమైతే వెంటనే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. కేంద్రానికి దేశంలో ఉచిత కరెంట్ ఇచ్చే తెలివి లేదు కానీ.. ఉచిత కరెంట్ ఇచ్చే తెలంగాణపై పడి ఏడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీఆర్ఏలను లష్కర్లుగా నియమిస్తాం
వీఆర్ఏలను లష్కర్లుగా నియమిస్తామనీ, సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ దానిపై అధ్యయనం చేస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. సోమవారం అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్న నేపథ్యంలో వీఆర్ఏలు సమ్మెను విరమించాలని కోరారు. పేస్కేలు అమలు చేయాలనీ, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గతంలో మస్కూరి అని పిలిచేవారనీ, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ రెవెన్యూ సహాయలు(వీఆర్ఏ) అని పేరు మార్చామని గుర్తుచేశారు. అదే సమయంలో వారి వేతనాన్ని కూడా రూ.10,500కి పెంచామన్నారు. తమ ప్రభుత్వమెప్పుడూ మానవీయతతో వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచినప్పుడల్లా కాంట్రాక్టు ఉద్యోగులకు ఎక్కడా జీతాలు పెంచరనీ, తానే పట్టుబట్టి చిన్న ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయాలనే సదుద్దేశంతో వారి జీతాలు కూడా పెంచేలా చేశామని తెలిపారు. మన దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా చేయలేదని చెప్పారు. తామెప్పుడూ తప్పులు చెప్పబోమనీ, చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నారు. వీఆర్ఏలు అనవసరంగా రోడ్లమీదపడి ఆందోళన చేస్తున్నారనీ, వాళ్లది అర్ధరహితమైన ఆందోళన అని అన్నారు. పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు విస్తరిస్తున్నాయనీ, అవి నడవాలంటే కొన్ని కిలోమీటర్లకు ఒక లష్కర్ అవసరమని తెలిపారు. వారిని లష్కర్లుగా నియమిస్తామన్నారు.