Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 నెలలుగా ఖర్చులు భరిస్తున్న యజమానులు, ఆసాములు
- 4.72కోట్ల మీటర్ల చీర ఉత్పత్తికి ఆర్డర్
- ఈ నెల 11వరకు 3.20కోట్ల మీటర్ల చీరలు అప్పగింత
- ఉత్పత్తి ధర నిర్ణయించడంలో ఆలస్యమే కారణం!
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / సిరిసిల్ల టౌన్
బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చిన ప్రభుత్వం.. అందుకు నిధులు మాత్రం విడుదల చేయలేదు. అప్పులు తెచ్చి చీరలు నేసిన యజమానులు తిప్పలు పడుతున్నారు. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పుకు వడ్డీ పెరుగుతోంది.. బతుకమ్మ చీరల ఉత్పత్తికి సంబంధించి రాజన్నసిరిసిల్ల జిల్లా పవర్లూమ్ యజమానులకు ప్రభుత్వం సుమారు రూ.112కోట్ల వరకు బకాయి పడింది. మరో పక్షం రోజుల్లో బతుకమ్మ పండుగ వస్తున్న క్రమంలో.. ఇప్పటికే ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన 4.72కోట్ల మీటర్ల బతుకమ్మ చీరల గుడ్డ ఉత్పత్తిలో ఈ నెల 11 వరకు 3.20కోట్ల మీటర్ల చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే, వాటికి సంబంధించి ఇంతవరకు రూపాయి కూడా యజమానులకు చెల్లించలేదు. మీటర్‌పై ఇది వరకు రూ.32 ప్రభుత్వం చెల్లించేది. దాన్ని కనీసం రూ.36కు అయినా పెంచాలని పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ వినతిపత్రం ఇచ్చిన నేపథ్యంలో ధర ఖరారు కాకపోవడంతో నిధులు విడుదల కాలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. 8 నెలలుగా చీరలు ఉత్పత్తి చేసిన యజమానులు, ఆసాములు తాము తెచ్చిన పెట్టుబడి అప్పుకు మిత్తి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలోని కోటి 20లక్షల మంది తెల్లరేషన్ కార్డులు ఉన్న ఆడపడుచులకు 2022 బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది మరింత అందమైన జరీ అంచులు, బూటా డిజైన్లతో కూడిన చీరలు ఉత్పత్తి చేయాలని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు 4కోట్ల 72లక్షల మీటర్ల వస్త్రం ఆర్డర్ ఇచ్చింది. 190 రంగుల్లో 19 రకాల డిజైన్లను రూపొందించింది. ఈనెల 20లోగా ఉత్పత్తి చేసి ఇవ్వాలని తెలిపింది. ఈ నేపథ్యంలో 8 నెలలుగా జిల్లాలోని మరమగ్గాలపై బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేస్తుండగా.. ఇన్ని నెలలకు సంబంధించి కార్మికుల కూలి, ఇతర ఖర్చులను యజమానులే భరిస్తూ వస్తున్నారు. ఈనెల 11వరకు ప్రభుత్వానికి 3కోట్ల 20లక్షల మీటర్ల చీరల వస్త్రాన్ని ప్రభుత్వానికి అప్పగించారు. ఈ20లోపు మిగతా వస్త్రం పూర్తి చేయనన్న నేపథ్యంలో ఆ వస్త్రాన్ని ప్రాసెసింగ్ చేసి బతుకమ్మ పండుగకు ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు అందించనుంది.
ఇప్పటికీ రూపాయి ఇవ్వని సర్కారు
బతుకమ్మ చీరలకు సంబంధించిన నిధులను ఇంతవరకు చెల్లించలేదు. ఆర్డర్ తీసుకున్నప్పటి నుంచి కూలి, ఇతర ఖర్చులూ భరిస్తూ వస్తున్న పరిశ్రమ యజమానులు తాము తెచ్చిన అప్పులకు మిత్తీ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, మీటర్‌కు ధర నిర్ణయించకపోవడమే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. గతేడాది వరకు యజమానులకు ప్రభుత్వం మీటర్ చీర ఉత్పత్తిపై రూ.32 చెల్లించేది. ఈ ఏడాది కూడా అంతే మొత్తంలో చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే పెరిగిన ధరలు, ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ల కారణంగా కూలి గిట్టుబాటు కావడం లేదని యజమానులు, ఆసాములు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కూలి పెంచాలని యజమానులంతా కలిసి సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు వినత్రిపత్రం అందించారు. ఇప్పటికే కూలి పెంపుపై టెక్స్టైల్ శాఖ అధికారులు మంత్రి కేటీఆర్‌తో సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. కూలి పెంపుపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతోనే డబ్బులు చెల్లించే ప్రక్రియ ఆలస్యమవుతుందని సమాచారం. ఏదేమైనా డబ్బులు అందకపోవడంతో యజమానులు, ఆసాములు ఇబ్బందులపాలవుతున్నారు. అప్పులు చేసిన ఆర్డర్‌ను పూర్తి చేసినా వచ్చే డబ్బులు ఆలస్యమైతే మిత్తి డబ్బులకు కూడా సరిపోమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధర నిర్ణయంకాకనే ఆలస్యం.. సాగర్- చేనేత జౌళిశాఖ ఏడీ
బతుకమ్మ చీరల ఉత్పత్తి విషయంలో మీటర్ వస్త్రంపై ప్రభుత్వం ఇంకా ధర నిర్ణయించాల్సి ఉంది. ప్రభుత్వం ఇచ్చే ధర గిట్టుబాటు కావడం లేదని యజమానులు వినతిపత్రం ఇచ్చారు. దానిపై సమీక్షించి త్వరలోనే ప్రభుత్వం ధర నిర్ణయించి డబ్బులు చెల్లిస్తుంది.
వెంటనే డబ్బులు అందించాలి
ఎనిమిది నెలలుగా ప్రభుత్వం రూపాయి కూడా బతుకమ్మ చీరలకు ఇవ్వలేదు. దీంతో మ్యాక్స్సైటీ, ఎస్ఎస్వై యూనిట్లు, చిన్న యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే మీటర్ వస్త్రం ఉత్పత్తిపై ధర నిర్ణయించి నిధులు విడుదల చేయాలి.
- తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు ముషం రమేష్
డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు
ఈసారి బతుకమ్మ చీరల ఆర్డర్లను 19 డిజైన్లు 190 రంగుల్లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఎనిమిది నెలలుగా ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి రాలేదు. దీంతో కూలి చెల్లించడంతోపాటు ముడి సరుకు, ఇతర ఖర్చులకు అప్పులు చేశాం. డబ్బులు ఇంకా ఆలస్యమైతే వచ్చిన లాభం కాస్త చేసిన అప్పులకు మిత్తి కిందికే పోతుంది.
- పాలిస్టర్ యజమానుల సంఘం అధ్యక్షులు మండల సత్యం