Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమరులైన 4వేల మంది కమ్యూనిస్టులు
- 10 లక్షల ఎకరాల భూ పంపిణీ: సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
- రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న సీపీఐ(ఎం) బైక్ ర్యాలీ
నవతెలంగాణ-కందుకూరు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వల్లనే నిజాం సర్కార్ తలవంచి సైన్యానికి లొంగిపోవడంతో తెలంగాణకు విముక్తి కలిగిందని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వారోత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం మహేశ్వరం మండలం తుక్కుగూడ, మహేశ్వరం నుంచి కందుకూరు వరకు చేపట్టిన బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కందుకూరు మండల కేంద్రంలో పార్టీ మండల కార్యదర్శి బి. శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. నైజాం అండతో తెలంగాణలో దొరలు, భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు అరాచకాలు చేశారని చెప్పారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారని, 50 వేల మంది జైలు పాలయ్యారని గుర్తుచేశారు. 10 లక్షల ఎకరాల భూమి పంచి పెట్టినట్టు తెలిపారు. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కౌలుదారీ చట్టం తీసుకొచ్చి భూములు పంచిందన్నారు. జాతీయ ఉద్యమంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాలు బ్రిటిష్ వారికి సేవకులుగా పనిచేశారని తెలిపారు. అలాంటి వారు విమోచం, విలీనం అంటూ ఆర్భాటాలు చేస్తున్నారని విమర్శించారు. బండి సంజరు యాత్రకు ఎలాంటి అర్థం లేదని, ఎన్నికల్లో గెలిచి, తెలంగాణను దోచుకొని తినాలని యాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 17న బీజేపీ విమోచన దినం, విలీన దినం పేరుతో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సమావేశాలు నిర్వహిస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రజల సమస్యలు గాలికి వదిలేసి, బంగారు తెలంగాణ అంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి, మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇండ్ల స్థలాలు లేని వారికి స్థలాలు, భూమి లేని వారికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీలో భూములు కోల్పోయే రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కందుకూరు మండల కేంద్రంలో కొత్తగూడ గ్రామ రెవెన్యూలో సర్వే నెంబరు 788లో ఇండ్ల స్థలాల కోసం సర్టిఫికెట్లు తీసుకున్న పేదలందరికీ వెంటనే స్థలాలు చూపించాలని డిమాండ్ చేశారు. లేదంటే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పంచుతామని స్పష్టంచేశారు. అనంతరం నేదునూరు గ్రామంలో గ్రామ శాఖ కార్యదర్శి అంకగాళ్ల కుమార్ అధ్యక్షతన బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
సర్వే నెంబర్ 9లో ఇండ్లస్థలాలు లేని వారికి సర్టిఫికెట్ ఇచ్చారని, వారందరికీ స్థలాలు చూపించాలని డిమాండ్ చేశారు. సభల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్, రాజు, కవిత, సామెల్, జిల్లా కమిటీ సభ్యులు దుబ్బాక రామ్‌చందర్, అల్వాల రవికుమార్, కిషన్, మల్లేష్, ప్రజానాట్యమండలి కళాకారులు వినోద్, గణేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు శంకర్, మస్కు చరణ్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాష్ కారత్, మండల కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.