Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పెట్టాలని తీర్మానించండి
- పోలీసు రిక్రూట్మెంట్ పరీక్షలో ఎస్సీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గించండి
- నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా వచ్చారా? బీజేపీ నేతగా వచ్చారా? : భట్టి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతుంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. 'కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు-పర్యవసానాలు' అంశంపై సోమవారం శాసనసభలో లఘ చర్చలో పాల్గొని మాట్లాడారు. 'దేశం ఎటుపోతున్నది? ఉమ్మడి జాబితాలోని విద్యుత్‌పై కేంద్రం పెత్తనమేంది? డబుల్ ఇంజిన్ ఏంది? రాష్ట్రంలో వేరే పార్టీ ఉంటే అభివృద్ధి చేయరా? అన్ని రాష్ట్రాలనూ సమ దృష్టితో చూడాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా? విభజన హామీ ప్రకారం లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు రావాల్సి ఉంది...అందులో రూపాయి అయినా ఇచ్చారా? ఇవ్వకపోగా 6,675 కోట్లు ఏపీకి చెల్లించాలంటారా? ఎవర్ని బెదిరిస్తున్నారు? దీనిపై అంతటా ఆలోచన జరగాలి. రాజ్యాంగం మీద దాడి జరుగుతున్నది. నియంతృత్వ పాలన తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగమే విద్యుత్ సవరణ బిల్లు. పార్టీలు వేరైనా ఇలాంటి వాటిని ముక్తకంఠంగా వ్యతిరేకించాల్సిందే' అంటూ అసెంబ్లీ సాక్షిగా భట్టి కేంద్రం తీరును ఎండగట్టారు. నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సభలో తీర్మానించాలని కోరారు.
ఫొటోపై రాద్ధాంతమేంటి?
'ప్రజాపంపిణీ వ్యవస్థ సరిగ్గా ఉందా? అన్ని సరుకులు ఇస్తున్నారా? అనే దానిపై కలెక్టర్‌ను అడిగితే బాగుండేది. అంతేగానీ, ఎవరి వాటా ఎంత అనేది వారికి అవసరం లేదు. ''ఏం కలెక్టర్? కిలో బియ్యం ఎంతో తెలుసా? కేంద్రానిదెంత? రాష్ట్రానిదెంత? ఏం మోడీ ఫొటో ఎందుకు పెట్టలేదు?'' అంటూ కామారెడ్డి కలెక్టర్నుద్దేశించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడటం తగదు. ఆమె ఆర్థిక మంత్రిగా రాష్ట్రానికి వచ్చారా? బీజేపీ నేతగా వచ్చారా? ఇంతవరకు ఏ ప్రధాని పొటో అయినా పెట్టారా? గతంలో మన్మోహన్ సింగ్, చిదంబరం ఫొటోలు ఏమైనా పెట్టారా? ఎందుకీ రాద్ధాంతం. ఇంతకు ఆహార భద్రతా చట్టం తెచ్చిందని ఫొటో పెట్టాలా? లేక ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నదని చెప్పడానికి ఫొటో పెట్టాలా? పన్నులు కడుతున్న పేదోళ్ల ఫొటో పెట్టాల్నా?మీ ఇంట్లో నుంచి ఏమైనా తెచ్చిపెడుతున్నారని మీ ఫొటో పెట్టాలా? లేక బీజేపీ ఆఫీసు నుంచి తెచ్చిపెడుతున్నారని ఫొటో పెట్టాలా?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఫొటో కోసమా మనం రాద్ధాంతం చేసేది? అని నిలదీశారు. ఫొటో కోసం కాకుండా ప్రజలకు సకాలంలో రేషన్ సరుకులు అందుతున్నాయా? లేదా? అని కలెక్టర్‌ను అడిగితే బాగుండేదన్నారు. అదే సమయంలో రాష్ట్ర విభజన హామీ చట్టం ప్రకారం బయ్యారం స్టీలు ఫ్యాక్టరీ ఇస్తామన్నాం..రాష్ట్రానికి వచ్చిందా? లేదా? రాకుంటే వెంటనే నిధుల్ని సమకూరుస్తాం అని చెబితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఐటీఐఆర్ ఇస్తానన్నాం వచ్చిందా? రాలేదా? అని వచ్చేలా చర్యలు తీసుకుంటామంటే ప్రజలు సంతోషపడేవారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆరా తీసి జాతీయ హోదా ఇస్తానన్నాం..అది వచ్చిందా? అని అడిగి నిధులు ఇప్పించేలా మాట్లాడితే మంచిగా ఉండేదని ఎద్దేవా చేశారు. 75 ఏండ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం క్రోనీ క్యాప్టలిస్టులకు అప్పగిస్తున్నదని విమర్శించారు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, రైల్వేల ప్రయివేటీకరణ జరుగుతున్న తీరును వివరించారు. చివరకు మిగిలిన వ్యవసాయం, రోడ్లు, విద్యుత్‌ను కూడా నచ్చినోళ్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఓవైపు కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రాయితీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ఎత్తేయాలనే ప్రచారాన్ని చేేయిస్తున్నదని ఆరోపించారు.
ప్రశ్నోత్తరాలను ఎత్తేయడం సబబు కాదు
ప్రస్తుత సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను ఎత్తేయడం సబబు కాదని భట్టి విక్రమార్క అన్నారు. శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి జోక్యం చేసుకుని 'ఓన్లీ విద్యుత్ బిల్లుపైనే మాట్లాడాలి..మిగతావేవి మాట్లాడినా రికార్డుల నుంచి తొలగించాలి' అని స్పీకర్‌ను కోరారు. ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యల్ని భట్టి తప్పుబట్టారు. ప్రశ్నోత్తరాలను ఎత్తేయడంతో ప్రజా సమస్యలను లేవనెత్తే, చర్చించే వేదిక లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిపై మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించడమేంటి? అంటూ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రత్యేక సమయం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఎస్ఐ, కానిస్టేబుల్ నియామక పరీక్షలో ఓసీ విద్యార్థులకు 100 నుంచి 80కి, బీసీలకు 80 నుంచి 60కి కుదించి ఎస్సీలకు మాత్రం గతంలో 60 ఉంటే ఇప్పుడూ 60 మార్కులనే కటాఫ్ మార్కులుగా నిర్ధారించడాన్ని తప్పుబట్టారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కటాఫ్ మార్కులను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. హాస్టళ్లలో, గురుకులాల్లో, ఐఐటీల్లో విద్యార్థులకు మంచి భోజనం, వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఎమ్మెల్యేలు విధిగా అక్కడికి వెళ్లి పరిశీలించేలా సీఎం ఆదేశించాలన్నారు. పంట నష్టపరిహారం అంచనా వేయించాలనీ, వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వింటర్ సెషన్‌ను 20 నుంచి 25 రోజులు నిర్వహించి అన్ని అంశాలపై సమగ్రం చర్చ జరిగేలా చూస్తామని హామీనిచ్చారు.