Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టడమే దేశభక్తా
- 24 గంటల ఉచిత కరెంటుపై కేంద్రం కక్షసాధింపు
- డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలున్న యూపీ, గుజరాత్లో అమలేదీ?
- విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలి:మండలిలో మంత్రి జగదీశ్‌రెడ్డి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రయివేటుపరం చేయడమే మోడీ సర్కారు లక్ష్యమని మంత్రి జి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ప్రధాని మోడీ మిత్రులైన కార్పొరేట్లకు లాభాలను కట్టబెట్టడమే దేశభక్తా?అంటూ ప్రశ్నించారు. సోమవారం శాసనమండలిలో 'కేంద్ర విద్యుత్ బిల్లు-పర్యవసానాలు'అనే అంశంపై లఘుచర్చకు ఆయన సమాధానమిచ్చారు. తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్‌ను వ్యవసాయరంగానికి అందిస్తున్నామని చెప్పారు. దీనిపై మోడీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలున్న యూపీ, గుజరాత్లో ఉచిత విద్యుత్ అమలు కావడం లేదన్నారు. గుజరాత్లో వ్యవసాయానికి ఆరు గంటల విద్యుత్‌ను అందిస్తున్నారనీ, అదీ డబ్బులకేనని గుర్తు చేశారు. ఢిల్లీ, లక్నో, బెంగుళూరు వంటి పట్టణాల్లో విద్యుత్ కోతలున్నాయనీ, తెలంగాణలో లేవని వివరించారు. దేశమంతా 24 గంటల కరెంటుపై చర్చ జరుగుతున్నదని అన్నారు. ఇది మోడీకి ఇష్టం లేదన్నారు. 20 ఏండ్లకుపైగా గుజరాత్లో, 15 ఏండ్లకుపైగా మధ్యప్రదేశ్‌లో బీజేపీ పాలిస్తున్నదని గుర్తు చేశారు. అయినా అక్కడ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అమలు కావడం లేదని విమర్శించారు. కానీ మోడీ మిత్రున్ని ప్రపంచ కుబేరుల్లో నెంబర్‌వన్‌గా చేసేందుకు కేంద్రం పనిచేస్తున్నదని చెప్పారు. కేసీఆర్ కాళ్లల్ల కట్టె పనులు చేస్తున్నదని విమర్శించారు. ఈ దేశాన్ని మోడీ దోస్తులకు అప్పగించే కుట్ర జరుగుతున్నదని అన్నారు. ప్రజా, రైతు వ్యతిరేక విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పార్టీలకతీతంగా సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలని కోరారు. ఈ దేశాభివృద్ధిని అడ్డుకునే పద్ధతిలో విద్యుత్ సవరణ బిల్లును కేంద్రం తెచ్చిందని విమర్శించారు. ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి విద్యుత్ రంగం వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.