Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నవంబర్ 8, 9, 10 తేదీల్లో నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో వీరేపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన మహాసభ ఆహ్వాన సంఘం సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర చట్టాన్ని పార్లమెంటులో పెడతానని మోడీ సర్కారు రైతు సంఘాల నేతలకు రాతపూర్వకంగా హామీఇచ్చి పది నెలలు గడిచినప్పటికీ అమలు చేయలేదన్నారు. రెండుసార్లు పార్లమెంటు సమావేశాలు జరిగినా బిల్లు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం రైతులను, దేశ ప్రజలను మోసం చేయటానికి పూనుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ శాసనసభ్యులు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షలోపు బ్యాంకు రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేయాలని, స్కేల్ ఫైనాన్స్ ప్రకారంగా పంట రుణాలు ఇవ్వాలని కోరారు. రైతు సంక్షేమ పథకాలు గతంలో ఉన్నవి కొనసాగిస్తూ కౌలు రైతులకు వర్తింపజేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు సంబంధించి ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఎరువుల ధరలు తగ్గించాలని సబ్సిడీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి, పెసరకాయల జంగారెడ్డి, బండ శ్రీశైలం, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మహిళా రైతు రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, రైతు సంఘం నల్లగొండ జిల్లా కార్యదర్శి కె.నాగిరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు మల్లు నాగార్జునరెడ్డి, దండా వెంకటరెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ప్రజాసంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.