Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరెస్టు చేసిన పోలీసులు
- ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి : వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే దాదేమియ
- లేకపోతే చలో అసెంబ్లీ చేపడతామని హెచ్చరిక
నవతెలంగాణ- బంజారాహిల్స్
రెండేండ్ల కింద అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసాల ముట్టడికి యత్నించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. పోలీసులు వీఆర్ఏలను అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వీఆర్ఏల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలపై ఏమాత్రం కనికరం చూపకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తోందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన చేపడితే ఎక్కడికక్కడ అరెస్టులు, అణచివేతలు కొనసాగించడం దుర్మార్గమన్నారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి వస్తే అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీ నిలబెట్టకోవాలని కోరారు. రెవెన్యూ చట్టాల ప్రక్షాళనలో భాగంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 22 వేలకు పైగా ఉన్న వీఆర్ఏలందరూ బడుగు బలహీన వర్గాల బిడ్డలేనని, వారందరినీ గౌరవంగా చూసుకుంటామని సీఎం చేశారని గుర్తు చేశారు. పే స్కేల్‌తో కూడిన ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ప్రమోషన్లు ఇస్తామని, 55 ఏండ్లు పై బడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకాలు ఇస్తామని గతంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని చెప్పారు. రెండేండ్లు గడిచినా నేటికీ సమస్యలు పరిష్కరించలేదన్నారు. సమస్యలు పరిష్కరించేలా చర్చించాలని మంత్రుల నివాసాల ముట్టడి చేపడితే అరెస్టు చేశారని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
50 రోజులు సమ్మె చేసినా ప్రభుత్వం స్పందించలేదని, ఈ కాలంలో 30 మంది వీఆర్ఏలు గుండెపోటుతో మరణించారని, వీటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే చలో అసెంబ్లీ చేపడతామని హెచ్చరించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వీఆర్ఏలను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ కో కన్వీనర్ వెంకటేష్ యాదవ్, వీఆర్ఏ జేఏసీ వికారాబాద్ జిల్లా చైర్మెన్ కె. సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా చైర్మెన్ ఎడ్ల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి నీరటి నరసింహ, వికారాబాద్ జిల్లా కో చైర్మెన్ గోపాల్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జేఏసీ నాయకులు ఉమామహేశ్వర్, బాలరాజు, భాస్కర్, కాంగ్రెస్‌పార్టీ జూబ్లీహిల్స్ డివిజన్ అధ్యక్షులు కాటూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.