Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సికింద్రాబాద్ రూబీ ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్‌లో అగ్ని ప్రమాదం
- షోరూమ్‌పై లాడ్జిలో చిక్కుకున్న టూరిస్టులు
- ఘటనా స్థలాన్ని పర్యవేక్షించిన మంత్రి తలసాని, సీపీ సీవీ ఆనంద్
నవతెలంగాణ-బేగంపేట్
ఒక్కసారిగా హాహా కారాలు, ఆర్తనాదాలు. ఏం జరుగుతుందోనని ఆలోచించేలోపే మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు అలముకున్నాయి. తమను కాపాడాలని వేడుకుంటున్న గొంతులు వినిపించాయి. ఓ వైపు మంటలు.. మరోవైపు అందులో చిక్కుకున్న వారి అరుపులతో ఆ ప్రాంతమంతా భయానకంగా.. ఆందోళనకరంగా మారింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై చర్యలకు ఉపక్రమించారు. పరిస్థితిని అదుపుచేసేలోపే క్షణాల్లోనే మంటల్లో చిక్కుకుని పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్రేన్లతో, ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది గాయపడిన వారిని అంబులెన్సుల్లో ఎక్కించి గాంధీ, యశోద ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో రాత్రి 12 గంటలు దాటే వరకు ఆరుగురు చనిపోయారు. ఎలక్ట్రిక్ బైక్ షోరూములో, పైన లాడ్జిలో ఇంకా పలువురు ఉండి ఉంటారని, మృతులు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గాయపడినవారిలో ఇంకొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
సికింద్రాబాద్‌లో, మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూబీ ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూమ్‌లో షార్ట్ సర్క్యూట్‌వల్ల సోమవారం జరిగిందీ ఘటన. రాత్రిపూట అకస్మాత్తుగా మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. భారీ శబ్దంతో బైక్ బ్యాటరీలు పేలాయి. దీంతో షోరూమ్ పైన లాడ్జిలో బసచేసిన టూరిస్టులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీల్లోంచి దూకే ప్రయత్నం చేశారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లాడ్జిలో చిక్కుకున్న వారిని కాడేప్రయత్నం చేశారు. మంటల్లో చిక్కుకున్న వారిని భారీ క్రేన్ల ద్వారా బయటకు తీసుకొచ్చారు. ఈలోపే పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని గాంధీ, యశోదా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే రాత్రి 12 గంటలు దాటాక ఏడుగురు చనిపోయినట్టు సమాచారం అందింది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం వార్త తెలియగానే రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు సాయికిరణ్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీసులు అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.