Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి
- మతోన్మాద శక్తులను పారద్రోలాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
- ఖమ్మంలో ఒక్క రోజు దీక్ష ప్రారంభం
నవతెలంగాణ- ఖమ్మం కార్పొరేషన్
రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని త్రీ టౌన్ ప్రాంతంలోని వ్యవసాయ గ్రేన్ మార్కెట్ ఎదుట సోమవారం ప్రజా సమస్యల పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్షను తమ్మినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) త్రీ టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాస్ అధ్యక్షత జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఅర్ 57 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారని, మూడేండ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని తెలిపారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న పింఛన్లనూ ఇవ్వాలన్నారు. సొంత జాగా ఉన్నవారికి మొదట రూ.5లక్షలు ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు రూ.3 లక్షలు ఇస్తామని సీఎం చెప్పడం దారుణమన్నారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, ఇండ్ల స్థలాలైనా ఇవ్వాలని కోరారు. అర్హత కలిగిన వారందరికీ కొత్త రేషన్ కార్డులు కోరారు. దేశంలో, రాష్ట్రంలో మతోన్మాద శక్తులు ముందుకొస్తున్నారని, వారిని పారద్రోలడానికి మనమంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. కాగా, ఖమ్మం నియోజకవర్గ పరిధిలో 18 సెంటర్లలో ఈ దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్, జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, పార్టీ త్రీ టౌన్ నాయకులు వజెనేపల్లి శ్రీనివాసరావు, 31 డివిజన్ కార్పొరేటర్ ఎర్ర గోపి, బండారు యాకయ్య, బండారు వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.