Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాహనాల రిజిస్ట్రేషన్‌కు టీఎస్ స్థానంలో టీజీ
- అందెశ్రీ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తాం
- జాతీయ జెండాతోపాటు తెలంగాణకు ప్రత్యేక జెండా
- సాయుధ పోరాట చరిత్రకు వారసులం మేమే...
- తెలంగాణ తల్లిని ప్రతిష్టిస్తాం : టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై ప్రస్తుతమున్న తెలంగాణ స్టేట్ (టీఎస్) స్థానంలో తెలంగాణ (టీజీ) అని మారుస్తామని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. కవి, గాయకుడు అందెశ్రీ రాసిన 'జయజయహే' పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని తెలిపారు. ఈ పాటపై సీఎం కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని విమర్శించారు. జాతీయ జెండాతోపాటు...తెలంగాణ ఆత్మగౌరవం ప్రతిబింబించేలా ప్రత్యేక జెండాను ఎగురవేస్తామన్నారు. ప్రస్తుత తెలంగాణ తల్లిని తిరస్కరిస్తూ...సబ్బండ వర్గాల తెలంగాణ తల్లిని ప్రతిష్ఠిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు అంజన్‌కుమార్ యాదవ్, గీతారెడ్డి, మధుయాష్కీ, షబ్బీర్‌అలీ, మల్లు రవి, ప్రీతమ్ తదితరులతో కలిసి రేవంత్ విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ త్యాగాలపై కేసీఆర్ కప్పిన మబ్బులను తొలగిస్తామనీ, ప్రజలకు తెలిసేలా రాష్ట్ర చరిత్రలో మార్పులు తీసుకొస్తామన్నారు. చరిత్రలో సెప్టెంబర్ 17కు ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. సాయుధ రైతాంగ పోరాటంలో లక్షలాది మంది కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. నిజాం పాలనలో మగ్గుతున్న ప్రజల తరుపున పోరాడి స్వాతంత్య్రం తీసుకువచ్చిందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ అబద్ధాల ఫ్యాక్టరీ ఇప్పుడు చరిత్రను కనుమరుగు చేస్తున్నదని విమర్శించారు. ఆ చరిత్రకు కాంగ్రెస్సే వారసులు అన్నారు. విలీన వజ్రోత్సవాలు నిర్వహించే హక్కు తమ పార్టీతోపాటు కమ్యూనిస్టులకే ఉందని చెప్పారు.
మునుగోడును దక్కించుకుందాం
మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించాలనీ, తద్వారా ఆ నియోజకవర్గాన్ని దక్కించుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి కోరారు. కాంగ్రెస్ గెలుపు కోసం కలిసి కట్టుగా కృషి చేద్దామని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 17, మునుగోడు ఉపఎన్నిక, భారత్ జోడో యాత్ర తదితర అంశాలపై చర్చించారు. సెప్టెంబర్ 17 అంశానికి బీజేపీ రంగు పులుముతున్నదని విమర్శించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలను పొందాలని ప్రయత్నిస్తుందన్నారు.
ఉప ఎన్నికల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు ఎనిమిది యూనిట్లకు బాధ్యతలు అప్పగించామన్నారు. మునుగోడులో ఉన్న 300 పోలింగ్బూతుల్ని పర్యవేక్షించేందుకు 150 మందిని నియమించనున్నట్టు తెలిపారు. ఈ విషయంలో చిన్న, పెద్ద తేడా అనే తేడా లేకుండా అందరూ సమానమేనన్నారు. ఈనెల 18 నుంచి అందరూ పని చేయాల్సిందేనన్నారు. ఆ రెండు పార్టీలు ధనబలాన్ని అడ్డగోలుగా ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీలను ఓడించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించాలని కోరారు.
అక్టోబర్ 24న రాష్ట్రంలోకి 'భారత్ జోడో యాత్ర'
రాహుల్‌గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నదని రేవంత్ చెప్పారు. యాత్రకు వస్తున్న ఆదరణ చూడలేకే బీజేపీ చిల్లర మల్లర ప్రచారానికి దిగుతున్నదని విమర్శించారు. అక్టోబర్ 24న తెలంగాణలోకి రాహుల్ పాదయాత్ర రాబోతున్నదని చెప్పారు. 15 రోజులపాటు అది రాష్ట్రంలో కొనసాగుతున్నదని తెలిపారు. మక్తల్ నుంచి మద్నూర్ వరకు 350 కిలోమీటర్లు ఆ యాత్ర సాగుతుందన్నారు. ఈ సమయంలో మూడు భారీ బహిరంగ నిర్వహించే అవకాశం ఉందన్నారు. సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్‌తోపాటు మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.