Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూమి సాగుచేసుకుంటున్న రైతులందరికీ పట్టాలివ్వాలి :
వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
- యాచారంలో రైతుల దీక్షకు మద్దతు
నవతెలంగాణ-యాచారం
ఆలయ భూములను 75 ఏండ్లకు పైగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులందరికీ రక్షిత కౌలుదారు చట్టం ప్రకారం ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ డిమాండ్ చేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తాడిపర్తి, కుర్మిద్ధ, సింగారం, నంది, వనపర్తి గ్రామాల కౌలు రైతులు తమకు న్యాయం చేయాలని రిలే నిరాహార దీక్షకు దిగారు. వీరికి వెంకట్ మద్దతు తెలిపారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం రాకముందు నుంచి నాలుగు గ్రామాల రైతులు ఈ భూమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారన్నారు. 1950లో రక్షిత కౌలుదారు చట్టం వచ్చిన తర్వాత 37/ ఏ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. నంది వనపర్తి ఓంకారేశ్వర ఆలయం పేరు మీద ఉన్న 1400 ఎకరాల్లో రైతులంతా సాగు చేస్తున్నారని, అప్పటి ప్రభుత్వాలు రైతులకు పట్టాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. 38/ఈ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉండగా, ఆనాటి భూస్వాములు రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఈ భూమిని మొత్తం దేవుని పేరు మీద రాసినట్టు తెలిపారు. అప్పట్నుంచి రైతుల నుంచి సిస్తులు వసూలు చేసి ప్రభుత్వం వారిని నిండా ముంచు తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు చెందా ల్సిన భూములను పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నో భూ పోరాటాలు చేసి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిన ఘనత ఎర్రజెండాకు ఉందన్నారు. నాలుగు గ్రామాల రైతులకు ఆ భూమిపై పూర్తి హక్కులు, పట్టాలు ఇచ్చేంత వరకూ వ్యవసాయ కార్మిక సంఘం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి.అంజయ్య, కేవీపీఎస్ జిల్లా నాయకులు ఆళంపల్లి నరసింహ, రైతు సంఘం మండల అధ్యక్షులు తావు నాయక్, భూ పోరాట సమన్వయ కమిటీ కార్యదర్శి జోగు రాములు, తదితరులు పాల్గొన్నారు.