Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాద్రి గోదారి మొదటి హెచ్చరిక దాటి ప్రవాహం
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం ఏజెన్సీలో మళ్ళీ గోదావరి ఉరకలు పెడుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీలో వాగులు, వంకలు మళ్లీ పొంగిపొర్లుతున్నాయి. దాంతో గోదావరి క్రమేపీ పెరుగుతోంది. భద్రాచలం వద్ద సోమవారం ఉదయం 8 గంటలకు 39.50 అడుగులున్న గోదారి సాయంత్రం 6 గంటలకు 45.10 అడుగులకు చేరుకుంది. గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ స్థానిక అధికారులను అప్రమత్తం చేసి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అధికారులు స్థానికంగా ఉండి వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు నెలలో 71 అడుగులకు పైగా గోదావరి చేరి భద్రాచలం ఏజెన్సీని అతలాకుతలం చేసిన విషయం విధితమే. మళ్లీ సెప్టెంబర్లో కూడా గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తూ ఉండటంతో భద్రాచలం ఏజెన్సీ గోదావరి పరివాహక ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆందోళనరేకిత్తిస్తోంది. మొన్న గోదావరి వచ్చిపోయిన తర్వాత రైతాంగం మళ్లీ వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టింది. ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే వరదలతో దెబ్బతిన్న రైతాంగం మళ్లీ పొంగిపొర్లుతున్న వరదలతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు.