Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి యాజమాన్యం స్పష్టీకరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాల్లో కొందరు అభ్యర్థుల పేర్లు తప్పుగా రావడంపై తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ డైరెక్టర్ (పర్సనల్) ఎస్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. దీనిపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలపై సోమవారంనాడొక ప్రకటనలో వివరణ ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం కేవలం ఆన్లైన్ ప్రక్రియ ద్వారానే అప్లికేషన్లను స్వీకరించామనీ, అభ్యర్థుల నుంచి హార్డు కాపీలను పంపించమని కోరలేదన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు వారి వివరాలను ఆన్లైన్లోనే సరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నారు. ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా స్వీకరించిన అప్లికేషన్ల ప్రకారం హాల్ టికెట్లను ఆల్ లైన్ ద్వారానే జారీ చేయడమైందన్నారు. ఈ రాత పరీక్ష ఫలితాలను శనివారం విడుదల చేయగా, అందులో అభ్యర్థుల పేరుకు బదులు రాష్ట్రం పేరు, క్వాలిఫికేషన్ వివరాలు రావడంపై సామాజిక మాధ్యమాల్లో పలు వార్తలు వచ్చాయన్నారు. దీనిపై జేఎన్టీయూ అధికారులతో మాట్లాడి పూర్తిగా పరిశీలించిన అనంతరం సదరు అభ్యర్థుల వివరాలను సేకరించగా, ఆన్లైన్ దరఖాస్తు సమయంలోనే వారు పొరపాటుగా వారి పేరు స్థానంలో తప్పుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, డిగ్రీ, బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని టైప్ చేశారని వెల్లడించారు . ఆన్లైన్ ప్రకియలోనే హాల్ టికెట్లను జారీ చేయడం, మూల్యంకనం కూడా కంప్యూటర్ ఆధారంగానే ఉండటం, ఫలితాలు కూడా కంప్యూటర్ జనరేటెడ్ షీట్లే కావడం వల్ల ఆ నలుగురు అభ్యర్థులు ఎంటర్ చేసిన పేర్లతోనే మెరిట్ జాబితా ముద్రితమైందని వివరణ ఇచ్చారు. పేర్లను తప్పుగా నమోదు చేసిన అభ్యర్థుల భవిష్యత్‌ను దష్టిలో ఉంచుకొని వారి ఫోటో, పుట్టిన తేదీ, తండ్రి పేరు తదితర వివరాలు, వారి సంతకాన్ని పోల్చి చూసి పరీక్ష నిర్వాహకులు వారిని పరీక్షకు అనుమతించారని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరారు. హాల్ టికెట్ నెంబర్లు... 3308978, 2204302, 2218581 7709069 లో ఈ తరహా తప్పిదాలు దొర్లాయని వివరించారు.అయితే ఈ అభ్యర్థులు ప్రొవిజినల్ జాబితాలో సెలెక్ట్ అయ్యారే తప్ప, తుది జాబితాలో అర్హత సాధించలేదని వివరణ ఇచ్చారు.