Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో రాష్ట్ర గిరిజన గురుకులాల విద్యార్థులు సత్తా చాటారని తెలంగాణ రాష్ట్ర గిరిజన,స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రుల సముదాయంలోని తన కార్యాలయంలో ఐఐటీలో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. రాజేంద్రనగర్‌తో పాటు మిగతా గిరిజన గురుకులాల్లో ఐఐటీ అడ్వాన్స్ శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఈ ఏడాది 237 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోగా, వారిలో 132 మంది విద్యార్థులు ఐఐటీ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించారని తెలిపారు. వి. శ్రీశైలం 121 ర్యాంకులతో మొదటి స్థానంలో, శ్రీకాంత్ 171 ర్యాంకుతో రెండో స్థానంలో, కె మహేందర్ 215 ర్యాంకుతో మూడో స్థానంలో, కె సంతోష్ 215 వ ర్యాంకుతో నాలుగో స్థానంలో, బి. ప్రేమ్ సాగర్ 31 ర్యాంకుతో ఐదో స్థానంలో నిలిచారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు కషి జరుగుతున్నదని తెలిపారు. గిరిజన గురుకులాల విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాజేంద్రనగర్‌లోని ఐఐటీ జేఈఈ ఎంసెట్ కోచింగ్ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం, పరిగి, హయత్ నగర్, వరంగల్‌లో ఈ ఏడాది కోచింగ్ సెంటర్లను ప్రారంభించినట్టు తెలిపారు.