Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సెంట్రల్ విస్టాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సోమవారం ఆమె శాసనమండలి ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగంలోని మూడో అధికరణ కల్పించిన హక్కుల మేరకు తెలంగాణ ఉద్యమం సాగిందని గుర్తు చేశారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారనీ, దానికి సంబంధించి మంగళవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెడుతుందని వివరించారు. ఈ సంస్కరణలు తేవడం వల్ల రైతుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు డిమాండ్లను అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపిస్తుందని చెప్పారు.
కవితకు కరోనా పాజిటివ్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. గత రెండు, మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్న ఆమె పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్దారణ అయ్యింది. దీంతో గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కవిత సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. కొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్లో ఉండనున్నట్టు ప్రకటించారు. అయితే తనను కలిసిన వారిలో ఎవరికైనా జ్వరం, ఇతర లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని కోరారు.