Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ, ఎస్టీ, చేతి వృత్తిదారులకు నష్టం చేయొద్దు.. : మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎవరి కోసం విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెడుతున్నారో స్పష్టం చేయాలని రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యుత్ సంస్కరణల ఫలితంగా రైతులు, వెనుకబడిన వర్గాలు.. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు, చేతి వృత్తులపై ఆధారపడి జీవించే వారిపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. ఎల్ఐసీ, రైల్వే, టెలిఫోన్ రంగాలను ప్రయివేటు పరం చేస్తున్న కేంద్రం.. వ్యవసాయ రంగంతో పాటు, కోళ్ల, చిన్న తరహా పరిశ్రమలపై ఆధారపడి బతుకుతున్న వారిని కూడా వదలటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా కార్పొరేట్ల ప్రయోజనాలకోసమేనని పేర్కొన్నారు. తెలంగాణ డిస్కంలకు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం అక్కడి జన్కో విద్యుత్ సరఫరా చేసినట్టు కేంద్రం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని తెలిపారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లు ద్వారా రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తున్నదని కొప్పుల ఈ సందర్భంగా విమర్శించారు.
బండి పాదయాత్ర ఎందుకు?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర దేనికోసమో చెప్పాలని కొప్పుల ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేయాలని పాదయాత్ర చేస్తున్నారా? అన్న విషయాన్ని స్పష్టం చేయాలని కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కళ్యాణాలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా ఫించన్లు, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, అన్నింటికీ మించి రైతు బంధు, రైతు భీమా వంటి పధకాలు ఎందుకు అమలు చేయటం లేదో చెప్పాలని నిలదీశారు. పాదయాత్రపేరుతో ప్రచారం పొందేందుకు ఢిల్లీ నుంచి నేతలు వస్తున్నారనీ, వారు రాష్ట్రానికి ఏం ఒరగపెట్టారో చెప్పాలని ప్రశ్నించారు.