Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసు కమిషనర్లకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పబ్‌లపై తీసుకున్న చర్యలను వివరించాలంటూ హైదరాబాద్ నగరంలోని ముగ్గురు పోలీస్ కమిషనర్లకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లకు న్యాయమూర్తి జస్టిస్ కె లలిత ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ మరొకరు దాఖలు చేసిన రెండు రిట్లను హైకోర్టు సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. పబ్‌లకు ఇచ్చిన అనుమతులు, వాటి అమలు ఉల్లంఘనలపై తీసుకున్న చర్యలు తెలియజేయాలని ఆదేశించింది. పబ్‌లకు అనుమతులు ఇచ్చే ముందే నివాస ప్రాంతాల్లో ఏర్పాటు, అక్కడ ఉన్న వసతులు, వాహనాల పార్కింగ్ వంటి సౌకర్యాలున్నాయో లేదో అధికారులు పరిశీలన చేశారో లేదో తెలియజేయాలని కోరింది. అగ్నిమాపక శాఖ, ఎక్సైజ్ శాఖ. జీహెచ్ఎంసీ, పోలీసులు తీసుకున్న చర్యలపై సమగ్రంగా నివేదిక అందించాలని ఆదేశించింది. పబ్‌లకు అనుమతి ఇవ్వడానికి ముందే అవి చట్ట ప్రకారం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశారో లేదో తెలియజేయాలని కోరింది. పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.
రోహింగ్యాలపై తీర్పు వాయిదా
అక్రమంగా చొరబడిన రోహింగ్యాలను నిర్బంధించేందుకు వీలుగా ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కొట్టేయాలంటూ కోరుతూ దాఖలైన నాలుగు రిట్లపై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ వేణుగోపాల్ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రోహింగ్యాలను అరెస్ట్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందనీ, రాష్ట్రాలకు లేదనీ, జైళ్లల్లో అక్రమంగా పెట్టిన రోహింగ్యాలను విడుదల చేసేలా ఉత్తర్వులివ్వాలంటూ దాఖలైన రిట్లను కొట్టేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాదించాయి.