Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారా?
- శాసనసభను పార్టీ కార్యకలాపాల అడ్డాగా మారుస్తారా?: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
'ఎదుటివారు మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం వింటలేదు అని అంటున్నారు. మరి మీరు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారా? నిండు శాసనసభ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని బదునాం చేస్తున్నారు. భవిష్యత్‌లో దేశ రాజకీయాల్లోకి రావాలని మూడు భాషల్లో మాట్లాడారు. నేను మూడు నిమిషాలు మాట్లాడితే బల్లలు కొట్టి బంద్ చేయించారు. పరోక్ష మిత్రులు కాంగ్రెస్, ప్రత్యక్ష మిత్రులు ఎంఐఎం తానా అంటే తందానా అంటూ భజన చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లు మాట్లాడితే టీఆర్ఎస్ వాళ్లు చప్పట్లు కొడుతున్నారు' అంటూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. సోమవారం ఆయన మీడియా పాయింట్లో మాట్లాడారు. ఒకసారి తీర్మానం చేసిన బిల్లుపై, రెండోసారి తీర్మానం చేసి శాసనసభ పరువు తీశారని అన్నారు. తమకు తెలంగాణ రూ.6వేల కోట్లు బకాయిలు ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణకే రూ.17వేల కోట్ల బకాయిలు రావాలని మీరు చెబుతున్నారని, అసలు ఏది నిజమని ప్రశ్నించారు. ఇద్దరు చీఫ్ సెక్రటరీలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం చేయాలని, అందుకు తాను బాధ్యత తీసుకుంటానని చెప్పారు. విద్యుత్ సంస్కరణ బిల్లు.. సవరణకు ప్రతిపాదించిన బిల్లు మాత్రమేనని, దీన్ని సెర్చ్ కమిటీకి పంపారు తప్ప ఆమోదించలేదని చెప్పారు. బిల్లులో ఎక్కడా మోటర్లకు మీటర్లు పెట్టాలనే విషయం లేదన్నారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్, సీఆర్ఎస్ ఏదైనా పెట్టుకోండని, ప్రజలు మాత్రం మిమ్ములను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేస్తారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించిందని, 33 జిల్లాల్లో ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కార్యాలయానికైనా స్థలమిచ్చారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షం అంటే కాంగ్రెస్, ఎంఐఎం మాత్రమే కాదని, ఒక్క సభ్యుడు ఉన్నా మాట్లాడే అవకాశమివ్వాలని సూచించారు. ధనిక రాష్ట్రమైనప్పుడు అప్పులెందుకని ప్రశ్నించారు. కేసీఆర్‌కు అసెంబ్లీలో భట్టి భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.