Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వ వివాదంపై దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరు పక్షాల వాదనలు ముగియడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి వెల్లడించారు. చెన్నమనేని తనకు జర్మనీ పౌరసత్వం ఉండగానే భారత పౌరసత్వాన్ని పొందారనీ, రాజ్యాంగం ప్రకారం రెండు దేశాల పౌరసత్వాలు ఉండకూడదనీ, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి 2009లో శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారని ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దీనిని విచారించిన కేంద్ర హౌంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని 2017 డిసెంబర్ 31న రద్దు చేసింది. పౌరసత్వ చట్టం సెక్షన్ 10(3) ప్రకారం చెన్నమనేని దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించారో, లేదో నిర్ణయించి తగిన ఉత్తర్వులు ఇవ్వలేదని హైకోర్టు తప్పుపట్టింది. ఆ తర్వాత కేంద్ర హౌం శాఖ సెక్షన్ 10(3) కింద 2019 నవంబర్ 20న రెండోసారి రద్దు చేసిందనీ, ఈ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటిస్తూ తీర్పు వెలువరించాలని చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది వై.రామారావు వాదనలు వినిపిస్తూ, భారత్ పౌరసత్వం చట్టానికి, జర్మన్ పాస్‌పోర్టు చట్టానికి సంబంధం లేకుండా ఫిర్యాదు చేస్తే దానిపై కేంద్ర హౌం శాఖ నిర్ణయం తీసుకోవడం చెల్లుబాటు కాదన్నారు. రెండు చట్టాలు వేర్వేరని చెప్పారు. జర్మనీ పాస్పోర్టుతో చెన్నమనేని ప్రయాణించినంత మాత్రాన ఆయనకు ద్వంద్వ పౌరసత్వం ఉన్నట్టు కాబోదన్నారు. ఈ విషయాన్ని జర్మనీ రాయబార కార్యాలయం రాతపూర్వకంగా తెలియజేసిందని చెప్పారు. చెన్నమనేని జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నారని చెప్పారు. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 10 (3) గురించి హైకోర్టు లేవనెత్తిన అంశాల జోలికి వెళ్లకుండా రెండోసారి పౌరసత్వాన్ని రద్దు చేయడం చెల్లదన్నారు. ఆ సెక్షన్ ప్రకారం దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించినా, దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేసినా పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉంటుందని తెలిపారు. ఆ సెక్షన్‌ను కేంద్రం గాలికొదిలేసి 2019 నవంబర్ 20న రెండోసారి రద్దు చేయడం చెల్లదన్నారు. చెన్నమనేని పౌరసత్వ వ్యవహారంపై కేంద్ర హౌం శాఖ టాండన్ నేతృత్వంలో వేసిన కమిటీ నివేదిక ప్రకారం చెన్నమనేనికి ఏవిధమైన నేర చరిత్ర లేదనీ, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని తేల్చి చెప్పిందన్నారు. పౌరసత్వ చట్టం సెక్షన్ 10(3) ప్రకార చెన్నమనేని భారత పౌరుడేనని చెప్పారు. చెన్నమనేని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారనీ, కేవలం రాజకీయ ప్రత్యర్ధి వరుస ఓటముల కారణంగా తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. ఎన్నికలు జరిగిన 30 రోజుల్లో ఫిర్యాదు చేయాలన్న నిబంధనలకు ఫిర్యాదుదారుడు తిలోదకాలిచ్చి 120 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే దాన్ని కేంద్ర హౌంశాఖ స్వీకరంచడం చట్ట వ్యతిరేకమన్నారు. కేంద్ర హౌం శాఖ తీసుకున్న రద్దు నిర్ణయాన్ని కొట్టేయాలని కోరారు. చెన్నమనేనికి రెండు దేశాల పౌరసత్వాలు ఉన్నాయని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ టి.సూర్యకరణ్‌రెడ్డి, ఆది శ్రీనివాస్ తరఫు సీనియర్ న్యాయవాది రవికిరణ్‌రావు వాదించారు. వాదనల తర్వాత హైకోర్టు తీర్పును తర్వాత వెలువరిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది.