Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలి
- మత్స్యకారుల అభివృద్ధికి రూ.125 కోట్లు
- గ్రామీణ వ్యవస్థ ఆర్థికంగా ఎదగాలన్నదే కేసీఆర్ లక్ష్యం: మంత్రులు తలసాని శ్రీనివాస్, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ- మునుగోడు
స్పష్టమైన అవగాహనతో ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పనతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రతి పథకమూ నిరంతరాయంగా అమల్లో ఉంటుందని, ఎవరో రాజీనామా చేస్తే వచ్చిన సంక్షేమ పథకాలు కావని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని కిష్టాపురం గ్రామంలో బుధవారం గొర్రెలు మేకలు, పశువులకు నట్టల నివారణా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. చెరువులో ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం సభలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్రం నుంచి నేతలు టైంపాస్ కోసం వచ్చి పోవడం తప్ప.. రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని ప్రశ్నించారు. దేశంలో రూ.2000 పింఛన్ ఎక్కడనైనా అమలులో ఉందా అని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా.. అర్హులైన ప్రతి ఒక్కరికీ 2 వేల 16, వికలాంగులకు 3 వేల 16 పింఛన్ అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కొంతమంది ముర్ఖులకు అర్థం కాక ఉప ఎన్నిక వచ్చినప్పుడే చేపలు, గోర్లు వస్తాయని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో ఒక పింఛన్ లబ్దిదారుడు చనిపోతే తప్ప మరో కొత్త పింఛన్ మంజూరయ్యేది కాదని, ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్ అందిస్తూ వృద్ధుల గౌరవం పెంచింది సీఎం కేసీఆర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న గొప్ప లక్ష్యంతో 'మన ఊరి- మన బడి' కార్యక్రమంలో పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు రూ.7200 కోట్ల బడ్జెట్ కేటాయించామని తెలిపారు.
చేపలు చెరువులో వేసేటప్పుడు మత్స్యకారులకు ఎక్కువ తక్కువ సమస్య తలెత్తకుండా ఉండేందుకు కౌంటింగ్ మిషన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు క్వాలిటీ సైజ్ అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. చేపలలో క్వాలిటీ లేకపోతే వాపస్ చేయాలని మత్స్యకారులకు సూచించారు. చేపలు సరఫరా చేసే వారికి ప్రభుత్వం నుంచి రూ.125 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. మత్స్యకారులు యూనిట్‌గా ఉండి మత్స్యకారుల కుటుంబంలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒకరికీ మెంబర్ షిప్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. రూ.10లక్షల వాహనాలను నాలుగు లక్షలకే మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గతంలో పాలించింది కాంగ్రెస్, బీజేపీనే కదా ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి చేసేదేముందని ప్రశ్నించారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటే అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, ఫిష్, గొట్ కార్పొరేషన్ చైర్మెన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మదర్ డెయిరీ చైర్మెన్ కృష్ణారెడ్డి, మత్స్యకారుల జిల్లా ఏడీ వెంకటయ్య, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్ తదితరులు పాల్గొన్నారు.