Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు కూనంనేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు బుధవారం ఆయన లేఖ రాశారు. ఆర్టీసీలో పనిచేస్తున్న 47 వేల మంది కార్మికులు చాలీచాలని వేతనాలు, అధిక పని ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వేతన సవరణ చేపట్టకపోవడంతో నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు. అంతేగాకుండా సంక్షేమ మండళ్లను రద్దు చేసి యూనియన్ కార్యకలాపాలకు అనుమతించాలని కోరారు. ఆర్టీసి గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2017, ఏప్రిల్ ఒకటి నుంచి వేతన సవరణకు సంబంధించి 16 శాతం ఐఆర్ ఇస్తున్నారని తెలిపారు. కానీ ఫిట్మెంట్తో కూడిన వేతన సవరణ 2021, ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయాలంటూ కార్మిక సంఘాలు పలుసార్లు ప్రభుత్వ దృష్టికి తెచ్చాయని గుర్తు చేశారు. 2020 జనవరి నుంచి రావాల్సిన ఆరు డీఏలను, రిటైర్ అయినవారికి, చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు 2019 జులై నుంచి లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లించాలని కోరారు. 2013 వేతన సవరణ బకాయిల బాండ్ల డబ్బులు చెల్లించాలని తెలిపారు. ఆర్టీసి యాజమాన్యం సీసీఎస్‌కు డబ్బులు చెల్లించాలని ఆర్టీసి ఉద్యోగుల సమాఖ్య డిమాండ్ చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ డిమాండ్లను తక్షణమే పరిష్కరించి ఆర్టీసి కార్మికులను ఆదుకోవాలని కోరారు.
కూనంనేనికి మందకృష్ణ అభినందనలు
ఇటీవల నూతనంగా ఎన్నికైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును ఎమ్పార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హైదరాబాద్‌లో బుధవారం కలిసి అభినందనలు తెలిపారు. జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిణామాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, ఎస్సీ వర్గీకరణ వంటి పలు అంశాలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్పార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ, సీనియర్ నాయకులు తిప్పారపు లక్ష్మణ్‌మాదిగ, కొమ్ము శేఖర్ మాదిగ, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ వలీవుల్లా ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.
మతసామరస్యాన్ని పెంపొందించాలి
దేశంలో లౌకికవాదం, జాతీయ సమగ్రత ప్రమాదంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల మధ్య మతసామరస్యం, శాంతి, సంఘీభావాన్ని పెంపొందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన ఆయనను అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఐప్సో) జాతీయ ప్రధాన కార్యదర్శి డి సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి కేవీఎల్, రాష్ట్ర నాయకులు మెట్ల జగన్, నాగేశ్వర్రావు, జి రఘుపాల్, టి రాకేష్‌సింగ్ బుధవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో కలిసి శాలువా, పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఆధునిక భారతదేశ చరిత్రలో అత్యంత ఎక్కువగా మత అల్లర్లు కేంద్రంలోని బీజేపీ పాలనలో నమోదయ్యాయని విమర్శించారు. భిన్న మతాలకు చెందిన ప్రజలు కలిసి సామరస్యంతో జీవిస్తున్న ఈ దేశంలో దాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మతోన్మాదం అత్యంత దారుణమైన హింసకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజాన్ని అనిశ్చిత వాతావరణంలో పడవేస్తుందని అన్నారు. మత సామరస్యం, దేశ సమగ్రతను కాపాడేందుకు ఐప్సో శాంతి యాత్రలు, సమావేశాలను నిర్వహించాలని కోరారు. ప్రజల ప్రాథమిక హక్కుల కోసం, సమానమైన, సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడం కోసం కృషి చేయాలన్నారు.