Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలపిట్ట, జమ్మిచెట్టును కాపాడుకుందాం : మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జమ్మిచెట్టు, పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో భాగమనీ, జమ్మి విశిష్టతను భావితరాలకు అందించేందుకుగానూ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా దసరా పండుగ నాడు ప్రతి ఊరిలోనూ, గుడిలనూ జమ్మి చెట్టు నాటే కార్యక్రమం చేపడతామని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గ్రీన్ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు.
బుధవారం హైదరాబాద్‌లోని కొత్తగూడ బొటానికల్ గార్డెన్స్ అర్బన్ ఫారెస్టు పార్కులో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మెన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారితో కలిసి జమ్మిమొక్కలు నాటి రెండో విడతను లాంఛనంగా ప్రారంభించారు. జమ్మిమొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్భంగా అన్ని గ్రామాలు, గుడుల్లో కలిపి లక్షా ఇరవై వేల జమ్మి మొక్కలను నాటేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. జమ్మిమొక్కలు నాటిన వారు తమ ఫొటోలను జమ్మి అని టైప్ చేసి 9000365000 నెంబర్‌కు వాట్సాప్ చేయాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు కోరారు.
బొటానికల్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా ఎంపీ జి. సంతోష్‌కుమార్
బొటానికల్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..270 ఎకరాల్లో విస్తరించిన ఈ అటవీ ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వం, అటవీశాఖ చొరవతో ప్రకృతివనంగా మారిందన్నారు. బొటానికల్ గార్డెన్స్ విశిష్టతను కాపాడేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానని హామీనిచ్చారు. వజ్రోత్సవ వేడుకల సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రన్ ఫర్ పీస్ కార్యక్రమం పోస్టర్, టీషర్ట్స్‌ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఆయన ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్, ఫారెస్ట్ కార్పోరేషన్ అధికారులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కరుణాకర్, బొటానికల్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.