Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ల మాదిరే జిల్లా కోర్టుల నిర్మాణం
- ఎన్హెచ్లను డబుల్ చేశాం
- దేశంలోనే తొలిసారిగా ఎమ్మెల్యేలకు అధికార నివాసాలు : ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి
''కొత్త సచివాలయ నిర్మాణం వచ్చే వేసవి నాటికి పూర్తవుతుంది. సున్నితమైన పనులతోనే ఆలస్యమవుతున్నది..కలెక్టరేట్ల మాదిరిగానే జిల్లా న్యాయస్థానాలు కడతాం...ఎమ్మెల్యేలకు అధికార నివాసాలు..రాష్ట్రంలో జాతీయ రహదారులను డబుల్ చేశాం..రిజినల్ రింగ్‌రోడ్డు నార్త్వింగ్ పనులు త్వరలో ప్రారంభమవుతాయి.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ప్రక్రియ నడుస్తున్నది..పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించాం.. పస్తుతం రాష్ట్రంలో ఆర్ అండ్ బీ పరిధిలో భవనాల విస్తీర్ణం 30 లక్షల చదరపు అడుగుల నుంచి 1.20 కోట్ల చదరపు అడుగులకు పెరిగింది. అంటే నాలుగు రెట్లు పెరిగింది. ఇది ప్రభుత్వ ఆస్తుల సృష్టేనంటూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఐ.గణపతిరెడ్డి తెలిపారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజైనా 'ఇంజినీర్స్ డే ' సందర్భంగా ఆర్ అండ్ బీ శాఖ కార్యకలాపాలపై నవతెలంగాణ ప్రతినిధి బి.బసవపున్నయ్యకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
ఆర్ అండ్ బీ వ్యవహారాలు ఎలా సాగుతున్నాయి ?
రోడ్లు, భవనాల శాఖ అనేక నిర్మాణాలతో తీవ్రమైన పనిఒత్తిడితో ఉంది. పలు ప్రాజెక్టులు చేపట్టాం. ప్రతిష్టాత్మకంగా కొత్త సచివాలయాన్ని కడుతున్నాం.కలెక్టరేట్లు, నర్సింగ్, సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం. చిన్నా, చితకవి ఇంకా చాలానే ఉన్నాయి.
కలెక్టరేట్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది ?
ఏ ప్రాజెక్టు అయినా సాధ్యమైనంత తొందరగా పూర్తిచేయడానికే ప్రయత్నిస్తాం. ఇప్పటివరకు 29 కలెక్టరేట్ల నిర్మాణ పనులు ప్రారంభించాం. 15 పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ గారు ఇప్పటికే 12 ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రభుత్వం పరిపాలన నడుస్తున్నది. మరో 10 భవనాల పనులు జరుగుతున్నాయి. చివరలో మంజూరైన కరీంనగర్, ములుగు, నారాయణ్‌పేట, వరంగల్, ములుగు జిల్లాల భవనాల ప్రక్రియ సాగుతున్నది. స్థలాన్ని బట్టి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. డిజైన్ దాదాపు అన్నింటికి ఒకటే. వీటి నిర్మాణానికి సర్కారు రూ.1365 కోట్లను సర్కారు కేటాయించింది.
ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసుల మాటేమిటీ ?
దేశంలోనే తొలిసారిగా 119 నియోజకవర్గాలకుగాను 104 చోట్ల ఎమ్మెల్యేలకు ఆఫీస్ కం రెసిడెన్స్‌ను భవనాలను అందుబాటులోకి తెస్తున్నాం. దీంతో పరిపాలన ప్రజలకు అందుబాటులోకి రానుంది. రూ.585 కోట్లతో వీటిని పూర్తిచేస్తున్నాం.
కొత్త సచివాలయం ఎప్పటిలోగా పూర్తవుతుంది ?
నూతన సచివాలయం పనులు వచ్చే వేసవి నాటికి పూర్తవుతాయి. దసరా నాటికి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కొన్ని సున్నితమైన పనులను మనుషులతోనే చేయాల్సి ఉంది. దీంతో కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సగం సగం పనులు చేసి ప్రారంభించడం సాధ్యం కాదు. మొత్తం అయ్యాకే ప్రారంభోత్సవం చేస్తాం. అత్యంత ప్రాధాన్యత క్రమంలో ప్రతిష్టాత్మకంగా పనులు చేస్తున్నాం. ప్రభుత్వం రూ.617 కోట్లు మంజూరు చేసింది. అంచనాలు పెరగవు. పనులు దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం ఏడు అంతస్థులతో కొత్త సచివాలయ నిర్మాణం జరగనుంది. అత్యాధునిక డిజైన్లతో నిర్మిస్తున్నాం. ఎప్పటికప్పుడు సీఎం, మంత్రి పనులను తనిఖీ చేస్తున్నారు.
జాతీయ రహదారుల సంగతేంటి ?
ఇటీవల జాతీయ రహదారుల నిర్మాణంలోనూ వేగం పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 2511 కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు 5000 కిలోమీటర్లకు పెరిగాయి. వీటి నిర్మాణం నిరంతర ప్రక్రియ. జాతీయ సగటుతో పొలిస్తే తెలంగాణలో అత్యధికంగా హైవేలు ఉన్నాయి. వాటి విస్తీర్ణం 2.2 లక్షల కిలోమీటర్ల నుంచి 4.4 లక్షల కిలోమీటర్లకు పెరిగింది.
హైదరాబాద్- విజయవాడ హైవే గురించి చెబుతారా ?
ఎల్ బి నగర్ నుంచి జీఎంఆర్ టోల్ గేట్ వరకు ఆరు లేన్లుగా ఈ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు రూ. 550 కోట్లు కేటాయించారు. సర్వీసు రోడ్లు సైతం నిర్మిస్తాం. ఆరాంఘర్- శంషాబాద్, ఉప్పల్ కారిడార్, బెంగళూరు హైవే పనులతో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలను కచ్చితంగా నివారించవచ్చు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటి ?
రాష్ట్రంలో ఏనిమది మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతున్నాయి. అడ్మిషన్లు వచ్చాయి. వచ్చే ఏడాదికి మరో తొమ్మిది మంజూరయ్యాయి. మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, కొత్తగూడెం, మహబూబాబాద్, వనపర్తి, నాగర్‌కర్నూల్, రామగుండం కాలేజీల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. మొదటి, రెండో సంవత్సరం తరగతులకు సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించాం. మూడవ, నాలుగో సంవత్సరం తరగతుల అవసరాల కోసం టెండర్లు పిలిచాం.
సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రుల సంగతేంటి ?
వరంగల్‌లో రూ.1100 కోట్లతో 2000 బెడ్లతో సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రిని కడుతున్నాం. హైదరాబాద్‌లో 1000 బెడ్ల ఆస్పత్రితోపాటు ఎల్బినగర్, సనత్‌నగర్, అల్వాల్ ఆస్పత్రులకు టెండర్లు పిలిచాం. నిమ్స్‌లో మరో 2000 బెడ్లతో సూపర్ స్పెషాల్టీ బ్లాకును నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది.
ఇంకా కొత్త ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా ?
అవును. జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల మాదిరిగా జిల్లా న్యాయస్థానాలు నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. పాత జిల్లా న్యాయస్థానాల స్థానే కొత్తవి రానున్నాయి. కలెక్టరేట్ల తరహాలోనే విశాలంగా పరిపాలనకు అనుగుణంగా ఉంటాయి. త్వరిత కేసుల పరిష్కారానికి అనువైన అన్ని వసతులను కొత్తగా నిర్మించబోయే జిల్లా న్యాయస్థానాల్లో ఏర్పాటు చేస్తాం.