Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ కార్యాలయంలో భౌతికకాయానికి శ్రద్ధాంజలి
- ఆయన నిరంతర అధ్యయనశీలి : నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నవతెలంగాణ దినపత్రిక ఎడిటోరియల్ బోర్డు సభ్యులు టీఎన్వీ రమణ (59) భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు నవతెలంగాణ సిబ్బంది, సీపీఐ(ఎం), ప్రజా సంఘాల నేతలు, సన్నిహితులు పెద్ద ఎత్తు తరలివచ్చారు. ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుధవారం అంబర్పేట శ్మశానవాటికలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. రమణ చితికి కూతురు వెన్నెల నిప్పంటించారు. 'జోహార్ రమణ..జోహార్ రమణ..సాధిస్తాం సాధిస్తాం.. రమణ ఆశయాలను సాధిస్తాం' అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు నవతెలంగాణ దినపత్రిక కార్యాలయంలో పలువురి సందర్శనార్ధం భౌతికకాయాన్ని ఉంచారు. ఆయన మృతికి సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మృతదేహంపై సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతా రాములు అరుణ పతాకాన్ని కప్పి పూలదండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రమణకు నివాళి అర్పించిన వారిలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత, ఉపాధ్యక్షులు ఎం.సాయి బాబు, ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య, డీజీ నర్సింహారావు, టి.జ్యోతి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, అధ్యక్షులు చుక్కరాములు, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి. సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రా ములు, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీరాంనాయక్, వృత్తి సంఘాల రాష్ట్ర కన్వీనర్ ఎమ్వీ. రమణ, తెలంగాణ మేకలు, గొర్రెల పెంపకం దారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్, సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం, ఎస్వీకే ప్రతినిధి బుచ్చిరెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, సీఐటీయూ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు, ఆయన సన్నిహితులు, తదితరులు ఉన్నారు. ఆయన నిరంతర అధ్యయనశీలి అనీ, కార్యకర్తలను తయారు చేయడంలో, ప్రోత్సహించడంలో ఆయనది ప్రత్యేక పాత్ర అని గుర్తుచేశారు. ఏ పని అప్పగించినా నిబద్దతతో పనిచేసేవారనీ, తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి సీపీఐ(ఎం) పూర్తికాలం కార్యకర్తగా వచ్చారని తెలిపారు. రమణ మృతికి సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు సంతాపం తెలిపారు.
నవతెలంగాణ ఘన నివాళి
సిబ్బంది సందర్శనార్ధం రమణ భౌతికకాయాన్ని నవతెలంగాణ కార్యాలయంలో ఉంచారు. ఎడిటర్ ఆర్. సుధాభాస్కర్, సీజీఎం పి.ప్రభాకర్, జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, ఎడిటోరియల్ బోర్డు సభ్యులు, సిబ్బంది, తదితరులు నివాళి అర్పించారు. రమణతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.