Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువత స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల నుంచి స్ఫూర్తి పొందాలి: గవర్నర్ తమిళసై సౌందరరాజన్
- పరేడ్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ప్రారంభం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నిజాం పాలన నుంచి విముక్తి పొందిన హైదరాబాద్ రాష్ట్రానికి సెప్టెంబర్ 17 నిజమైన విమోచన దినం అని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. అప్పట్లో రజాకార్లు సాగించిన దుశ్చర్యలను ఆమె గుర్తుచేసుకున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్య్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్‌ను బుధవారంనాడామె ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడారు. హైదరాబాద్ విమోచన వారోత్సవాలను సెప్టెంబర్ 17 నుంచి అధికారికంగా ఏడాది పాటు (2023 సెప్టెంబర్ 17 వరకు) నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాల గురించి తెలుసుకుని యువత స్ఫూర్తి పొందాలని చెప్పారు. హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి కల్పించి భారతదేశంలో విలీనం చేసేందుకు ఉక్కు మనిషి సర్దార్ హౌంమంత్రి సర్దార్ వల్లభ్‌భారు పటేల్ ఆపరేషన్ పోలో కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తుచేశారు. ఈ నెల 17న హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ప్రస్తుత హౌంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సిబిసి) డైరెక్టర్ జనరల్ (సౌత్) ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, వందేమాతరం రామచంద్రారావు, భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డి వంటి స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన 60 ఫొటోలను ప్రదర్శనకు ఉంచినట్టు తెలిపారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రమణారెడ్డి, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా గవర్నర్ సన్మానించారు. సాంస్కతిక శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి ఉమా నండూరి తదితరులు పాల్గొన్నారు.