Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్బెల్ట్ ఏరియాల్లో కాంట్రాక్టు కార్మికుల నిరసన
- యాజమాన్యం దిష్టిబొమ్మ దహనం
- గోదావరిఖనిలో భారీ ర్యాలీ
నవతెలంగాణ- విలేకరులు
సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంపై పోలీసుల దౌర్జన్యం.. అక్రమ అరెస్టులను కార్మికులు ముక్తకంఠంతో ఖండించారు. సింగరేణి యాజమాన్యం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 9న ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వేతనాలు పెంచినట్టుగా 30 శాతం పీఆర్సీని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వర్తింపజేయాలని, జీవో నెంబర్ 22 ప్రకారం వేతనాలు చెల్లించాలని కార్మికులు మంగళవారం చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. అయితే, కార్యక్రమానికి వెళ్లకుండా సింగరేణి వ్యాపితంగా అన్ని ప్రాంతాల్లో అడుగడుగునా నాయకులను, కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించటాన్ని నిరసిస్తూ జేఏసీ పిలుపులో భాగంగా బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు కార్మికులు మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలియజేశారు. కార్మికులకు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే.సాబీర్పాషా సంఘీభావం తెలిపారు.
కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేయటాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా మందమర్రి లో బస్టాండ్ ఎదుట సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. అనంతరం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి సింగరేణి యాజమాన్యం దిష్టిబొమ్మను దహనం చేశారు. తమ సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం సింగరేణి కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మె పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో ఆరోరోజు కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ గోదావరిఖని మెయిన్ చౌరస్తా నుంచి శివాజీ నగర్, మేదరి బస్తీ, కల్యాణ్ నగర్, లక్ష్మీనగర్ మీదుగా వందలాది మంది కాంట్రాక్టు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం మెయిన్ చౌరస్తాలో మానవహారం చేపట్టారు. యాజమాన్యం ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే కార్మికులను తొలగిస్తామని అనడం సిగ్గుచేటన్నారు. అదే జరిగితే రాబోవు రోజుల్లో జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత యాజమాన్యమే వహించాల్సి ఉంటుందని నాయకులు హెచ్చరించారు.