Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అణగారిన వర్గాలను చదువుకు దూరం చేయటమే రామరాజ్యమా...?
- వర్శిటీల్లో తగ్గుతున్న దళిత, గిరిజన రీసెర్చ్ స్కాలర్ల సంఖ్య
- మోడీ హయాంలో భిన్నత్వంలో ఏకత్వానికి తూట్లు
- ఎస్ఎఫ్ఐ బహిరంగ సభలో సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు శివదాసన్
- తెలంగాణలోనే అత్యధిక మంది పిల్లలు 'ప్రయివేటు'కు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
- స్ఫూర్తిదాయకంగా ఎస్ఎఫ్ఐ నాలుగో మహాసభ ప్రారంభం
కరీంనగర్ నుంచి బి.వి.యన్.పద్మరాజు
విద్య, కృత్రిమ మేధ, సాంకేతికరంగాల్లో భారత్‌ను విశ్వగురు చేస్తామంటూ ఊదరగొడుతున్న మోడీ సర్కారు... విద్యారంగానికి ప్రతీయేటా నిధులు తగ్గిస్తూ పోతున్నదని సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు, ఎస్ఎఫ్ఐ అఖిల భారత పూర్వ అధ్యక్షులు వి.శివదాసన్ విమర్శించారు. ఆ రంగానికి చాలినన్ని నిధులు కేటాయించకపోతే మనదేశం విశ్వగురు ఎలా అవుతుందంటూ ఆయన ప్రశ్నించారు. విద్యారంగానికి 10శాతం నిధులు కేటాయించాలంటూ కొఠారి కమిషన్ చెబితే... ఆ పని చేయని కేంద్రం... జీఎస్టీ పేరిట పేదలు, సామాన్యులపై మాత్రం భారాల మీద భారాలు వేస్తున్నదని ఎద్దేవా చేశారు. మాట్లాడితే రామరాజ్యం తెస్తామంటూ బీజేపీ నేతలు చెబుతున్నారనీ... అణగారిన వర్గాల బిడ్డలను విద్యకు దూరం చేయటమే మీ రామరాజ్యమా...? అని నిలదీశారు. భారతదేశ మూల సూత్రమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీసేందుకు మతతత్వ శక్తులు అనేక కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ప్రజల మధ్య ఐక్యత, దేశ సమైఖ్యత కోసం విద్యార్థులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ క్రతువులో ఎస్ఎఫ్ఐ ముందు పీఠిన నిలబడాలని సూచించారు.
భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర నాలుగో మహాసభలను పురస్కరించుకుని బుధవారం కరీంనగర్లో బహిరంగసభను నిర్వహించారు. స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం (మల్లు స్వరాజ్యం ప్రాంగణం)లో నిర్వహించిన ఈ సభకు శివదాసన్ ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శనిగరపు రజనీకాంత్ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రధాన వక్తగా పాల్గొని సందేశమిచ్చారు. ఈ సందర్భంగా శివదాసన్ ప్రసంగిస్తూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న తీరును సోదాహరణంగా వివరించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలంటూ ఆర్భాటంగా ప్రకటించిన బీజేపీ సర్కారు... ప్రస్తుతమున్న కొలువులను ఊడబెరుకుతున్న వైనాన్ని అంకెలు, గణాంకాలతో సహా ఏకరువు పెట్టారు. జాతీయ గీతాన్ని రచించిన మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ దేశంలోని అన్ని ప్రాంతాలు, భాషలకు సమాన ప్రాధాన్యతనిచ్చారని గుర్తు చేశారు. అందుకు భిన్నంగా ఆరెస్సెస్, బీజేపీ... హిందీ, హిందూ, హిందూత్వ అంటూ జనాన్ని గందరగోళ పరుస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని భాషలు, మతాలు, ప్రాంతాలను గౌరవిస్తూ సమభావనతో మెలగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 'పదండి ముందుకు.. పదండి తోసుకు.. పదండి పోదాం పైపైకి...' అనే శ్రీశ్రీ అభ్యుదయ గీతాన్ని తెలుగులో చదివిన శివదాసన్... సభికుల్లో స్ఫూర్తిని, ఉత్సాహాన్ని నింపారు. 2019 కంటే ముందు దేశంలో 9 వేల పై చిలుకు ఫెల్లోషిప్పులుండేవని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాటి సంఖ్య నానాటికీ తగ్గటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో మొత్తం విద్యా సంస్థల్లో కేవలం 700 టాయిలెట్లే.. ఉన్నాయనీ, కానీ అదే రాష్ట్ర రాజధాని ముంబయిలోని ఒక పేరుమోసిన సంపన్నుడి ఇంట్లో 800 టాయిలెట్లు ఉన్నాయని గుర్తు చేశారు. దీన్నిబట్టే దేశంలోని విద్యారంగ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని వివరించారు. ప్రస్తుతం దేశంలోని ఐఐఎమ్‌ల్లో ఒక్క దళిత రీసెర్చి స్కాలర్ లేకపోవటం శోచనీయమన్నారు. ఐఐటీలు, త్రిబుల్ ఐటీల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో విఫలమైన మోడీ సర్కారు... తద్వారా దేశంలో చదువుకున్న యువతను నిరాశా నిస్పృహల్లో పడేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైల్వే శాఖలో 2,25,000 పోస్టులు, ఆర్మీలో 1,20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఇదే తరహాలో నౌక, వైమానిక దళ విభాగాల్లోనూ పెద్ద ఎత్తున ఖాళీలున్నాయని తెలిపారు. వీటిని భర్తీ చేయకుండా సర్కారు చోద్యం చూస్తున్నదని విమర్శించారు. అలాంటప్పుడు యువత భవిష్యత్ ఏం కావాలంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో చైతన్యానికి ప్రతీక అయిన తెలంగాణ బిడ్డలుగా, కొమురం భీం, వీరనారి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం వారసులుగా కేంద్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలపై పోరాడాలని శివదాసన్ పిలుపునిచ్చారు.
నర్సిరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలోని విద్యారంగ పరిస్థితి, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోని సమస్యలు, ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు తదితరాంశాలను విడమరిచి చెప్పారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలవేళ మనం స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నామని చెప్పారు. దేశంలో దళిత, గిరిజన బిడ్డలకు ఇప్పటికీ విద్య అందని ద్రాక్షగానే మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటప్పుడు దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టా..? రానట్టా..? అని ప్రశ్నించారు. హోదా, గౌరవానికి సంబంధించి పెద్దోళ్లు, పేదోళ్లు అనే తారతమ్యాలు కొనసాగుతున్న క్రమంలో ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా..? అని వ్యాఖ్యానించారు. 2014 నుంచి పాలకులు ఒక క్రమపద్ధతిలో విద్యారంగాన్ని నాశనం చేస్తూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారనీ, అర్హత లేని వారిని కూడా వీసీ కుర్చీలో కూర్చోబెడుతున్నారని తెలిపారు. మరోవైపు దుర్మార్గమైన నూతన విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) తీసుకొచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. 'నాణ్యమైన పనివారు లేక ప్రపంచ మార్కెట్ ఇబ్బందులు పడుతున్నది...' అంటూ అందులో పేర్కొన్నారని వివరించారు. అంటే దేశభక్తులను కాకుండా నాణ్యమైన పనివాళ్లను తయారు చేయటమే ఎన్ఈపీ ఉద్దేశమని స్పష్టం చేశారు. దాన్ని రద్దు చేయాలనీ, భారత రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా మార్చాలనీ డిమాండ్ చేశారు. విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో నిధులు 3.8 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గించటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలోనూ విద్యారంగ పరిస్థితి అంత బాగా లేదన్నారు. దేశం మొత్తం మీద తెలంగాణలోనే అత్యధిక మంది పిల్లలు ప్రయివేటు స్కూళ్లకు వెళుతున్నారని తెలిపారు. ప్రభుత్వం గొప్పగా చెబుతున్న గురుకులాల్లో కేవలం ఐదు లక్షల మందే చదువుతున్నారని చెప్పారు. వాటి బయట ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లకు పోతున్న 55 లక్షల మంది విద్యార్థుల పరిస్థితేంటని ప్రశ్నించారు. కేవలం గురుకులాల్లోని పిల్లల గురించి పదే పదే చెబుతూ...అంతా బ్రహ్మాండంగా ఉందీ అంటే సరిపోతుందా..? అని ఎద్దేవా చేశారు. రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం రూ.200 కోట్లు విద్యారంగానికి కేటాయిస్తే... పారిశుధ్యాన్ని మెరుగుపరచొచ్చు, సర్వీస్ పర్సన్స్ (స్వీపర్లు)ను ఏర్పాటు చేయొచ్చని సూచించారు. ఆ పని చేయలేరా..? అంటూ నర్సిరెడ్డి... ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో గురుకులాలు, హాస్టళ్లలోని సమస్యలు, బడ్జెట్లో నిధులతోపాటు అంతరాలు లేని విద్య కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. బహిరంగ సభలో ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీపీ సాను, మయూక్ బిశ్వాస్, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు, గర్ల్స్ కన్వీనర్ ఎమ్.పూజ, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం ప్రతినిధుల సభ ప్రారంభమైంది. బహిరంగ సభకు ముందు స్థానిక తెలంగాణ చౌక్ నుంచి ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం వరకూ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మహాసభలు శుక్రవారం వరకూ కొనసాగనున్నాయి.