Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమరశీల పోరాటాలతోనే ఎస్ఎఫ్ఐకి ఆదరణ
- వర్సిటీలు, కాలేజీల ఎన్నికల్లో మాదే విజయం
- ఎన్ఈపీతో దేశానికి నష్టం- విద్యార్థుల భవిత ఆగం
- సావర్కర్, గోల్వాల్కర్, గాడ్సేను సమరయోధులుగా చిత్రీకరిస్తున్న కేంద్రం
- మహాత్మాగాంధీని మరిచిపోతున్న నేటి తరం విదార్థులు
- డిసెంబర్లో హైదరాబాద్‌లో జాతీయ మహాసభలు
- 'నవతెలంగాణ'తో ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను
కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరిస్తున్న విద్యా, విద్యార్థి వ్యతిరేక విధానాలపై గతంలో పాన్ ఇండియా స్థాయిలో ఉద్యమించామనీ, ఇప్పుడు కూడా వాటిని కొనసాగిస్తామని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత అధ్యక్షులు విపి సాను చెప్పారు. సమరశీల ఉద్యమాలతోనే దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐకి ఆదరణ పెరిగిందని ఆయన తెలిపారు. ఒకానొక సమయంలో తాము ప్రతిపక్ష పాత్రను పోషించామని అన్నారు. హెచ్‌సీయూ, జేఎన్‌యూ ఇలా దేశంలో ఉన్న అన్ని వర్సిటీల్లోనూ ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిశాయని గుర్తు చేశారు. అందుకే కేంద్రీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలతోపాటు కాలేజీల్లో సైతం నిర్వహించిన ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ జెండా రెపరెపలాడిందని వివరించారు. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)-2020 దేశానికే ప్రమాదకరమని విమర్శించారు. అది అమల్లోకి వస్తే విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతుందని హెచ్చరించారు. డ్రాపౌట్లు పెరుగుతాయనీ, ఉన్నత విద్య చదివే వారి సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ఈపీని ఉపసంహరించుకోవాలంటూ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కరీంనగర్లో కొనసాగుతున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనడానికి విచ్చేసిన సాను... నవతెలంగాణప్రతినిధి
బొల్లె జగదీశ్వర్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ...
నూతన విద్యా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. దాని వల్ల దేశానికి, విద్యార్థులకు కలిగే నష్టమేంటి..?
మోడీ అధికారంలోకి వచ్చాక 2016 నుంచి నూతన జాతీయ విద్యావిధానంపై చర్చ కొనసాగుతున్నది. దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోలేదు. విద్యావేత్తలు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలను సంప్రదించలేదు. ఆర్ఎస్ఎస్, సంఫ్‌ుపరివార్ ఆలోచనలను కేంద్రం ఏకపక్షంగా అమలు చేయాలని చూస్తున్నది. అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నాం. విద్య తొలుత రాష్ట్రాల జాబితాలో ఉన్నది. ఇందిరాగాంధీ దాన్ని ఉమ్మడి జాబితాలోకి మార్చారు. కానీ మోడీ ప్రభుత్వం రాష్ట్రాలతో సంబంధం లేకుండా నియంతృత్వ పద్ధతిలో ఎన్ఈపీని తెస్తున్నది. అయితే దేశంలో వివిధ మతాలు, కులాలు, భాషలు, సాంప్రదాయాలున్నాయి. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, భౌగోళిక పరిస్థితులున్నాయి. వాటిని కేంద్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రాల సిలబస్ల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారు. కానీ కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పేరుతో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్‌తో నీట్, సీయూఈటీ, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, యూజీసీ నెట్ వంటి పరీక్షలను నిర్వహిస్తున్నది. దీనివల్ల గ్రామీణ, పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో కోచింగ్ తీసుకున్న వారికే మంచి ర్యాంకులతోపాటు మెడిసిన్, ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు వస్తున్నాయి. ఇంకోవైపు ఎన్ఈపీ అమల్లోకి వస్తే డ్రాపౌట్లు బాగా పెరిగిపోతాయి. ప్రస్తుతం ఉన్నత విద్యకు 26 శాతం మంది వస్తున్నారు. భవిష్యత్తులో ఆ శాతం తగ్గే ప్రమాదముంది. ఎన్ఈపీలో రాజ్యాంగ విలువలు, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామాజికన్యాయం వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వలేదు. దాంతో దేశ సమగ్రత, సార్వభౌమాధికారం ప్రమాదంలో పడతాయి. అందుకే ఎన్ఈపీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతాల లక్ష్యం ఏంటి..?
'సేవ్ ఇండియా - సేవ్ ఎడ్యుకేషన్-సేవ్ కాన్స్టిట్యూషన్' నినాదంతో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఐదు జాతాలు ప్రారంభమయ్యాయి. నాలుగు జాతాలు ముగిశాయి. ఈనెల 19న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఐదో జాతా ముగియనుంది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యావ్యతిరేక విధానాలను విద్యార్థుల్లోకి తీసుకెళ్లడమే వాటి లక్ష్యం. తద్వారా విద్యార్థులను చైతన్యపరిచి ఉద్యమాలకు సన్నద్ధం చేస్తాం. ఇంకోవైపు మోడీ ప్రభుత్వం చరిత్రతోపాటు పాఠ్యపుస్తకాలను వక్రీకరిస్తున్నది. కర్నాటకలో టిప్పుసుల్తాన్, అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, భగత్‌సింగ్, జోతిబాఫూలే, సావిత్రాబాయిఫూలే, పెరియార్, నారాయణగురు వంటి వారి చరిత్రను పాఠ్యాంశాల నుంచి తొలగించింది. గోల్వాల్కర్, వీర్ సావర్కర్, నాథురాంగాడ్సేల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చింది. వారినే స్వాతంత్య్ర సమరయోధులుగా చిత్రీకరిస్తున్నది. పక్షి రెక్కలపై కూర్చుని సావర్కర్ జైలు నుంచి బయటికెళ్లే వారంటూ పాఠ్యాంశాల్లో చేర్చడం గమనార్హం. ఈ రకంగా బీజేపీ సూడో సైన్స్‌ను విద్యార్థులకు అందిస్తున్నది. ఈతరం విద్యార్థులకు మహాత్మాగాంధీ ఎవరో తెలియడం లేదు. స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు చెప్పమంటే అక్షరుకుమార్, మహేంద్రసింగ్ ధోని అంటున్నారు. నాణ్యమైన విద్య, అందరికీ ఉపాధి అవకాశాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోడీ ఆ హామీని నిలబెట్టుకోలేదు. తద్వారా యువత ఆశలను ఆయన వమ్ము చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 11 లక్షల పోస్టులనూ భర్తీ చేయడం లేదు. అగ్నిపథ్ పథకాన్ని తేవడమంటే నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడడమే. మరోవైపు లౌకికత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి జరుగుతున్నది. జాతాల ద్వారా ఈ అంశాలను విద్యార్థుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాం.
విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడులు కొనసాగుతున్నాయి. అయినా విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎలా గెలవగలుగుతున్నారు...?
జేఎన్‌యూ సహా పలు విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో ఎస్ఎఫ్ఐ నాయకులపై ఏబీవీపీ గూండాలు దాడి చేస్తున్నారు. అయినా మేం బెదరకుండా విద్యారంగం, విద్యార్థుల సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నాం. అందుకే వారు మావైపు ఆకర్షితులవుతున్నారు. విద్యార్థి సంఘ ఎన్నికల్లో గెలవడానికి మా పోరాటాలే ప్రధాన కారణం. రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఐదు వర్సిటీల్లో ఒక వర్సిటీ పూర్తిగా గెలిచాం. ఇంకో వర్సిటీలో మెజార్టీ స్థానాలతోపాటు 68 కాలేజీల్లో గెలిచాం. మధ్యప్రదేశ్, గుజరాత్‌లోనూ విజయం సాధించాం. హెచ్‌సీయూ, జేఎన్‌యూ, పుదుచ్ఛేరి, అంబేద్కర్ వర్శిటీల్లో ఎస్ఎఫ్ఐ గెలవడంతో ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థులు సైతం బాగా ఆలోచించి అండగా నిలబడుతున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులంతా పోరాటం సాగించారు. అప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఉద్యమించాం. అందరికీ విద్య, అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం. అందుకోసం సమరశీలపోరాటాలు నిర్మిస్తాం. లౌకికత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం.
ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభల గురించి చెప్పండి...
ఈ ఏడాది డిసెంబర్‌లోపు ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలను నిర్వహిస్తాం. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఇందుకు వేదిక కానుంది. అఖిల భారత కమిటీలో చర్చించిన తర్వాత ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసి పూర్తి వివరాలను ప్రకటిస్తాం. ఉమ్మడి ఏపీలో 2005లో హైదరాబాద్‌లో అఖిల భారత మహాసభలు జరిగాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా అఖిల భారత మహాసభలు జరుగుతుండడం విశేషం.